భాజపా ఈసారి చాలా రాష్ట్రాల్లో గెలిచిందని, రానున్న రోజుల్లో ఆ పార్టీ మరింతగా ఎదగకుండా నిలువరిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేరళ, అసోమ్ రాష్ట్రాల్లో పోటీ చేయబోమని గతంలో ప్రకటించిన మాటకే తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కార్పొరేటర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస నష్టపోయింది నిజమేనని.. రాజకీయ ఉద్ధండుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూస్తామన్నారు.
గ్రేటర్‌లో భాజపాకు లభించింది తాత్కాలిక విజయమేనన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేసి 44 గెలిస్తే.. ఈసారి 51 చోట్ల పోటీ చేసి 44 గెలిచామని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 34 డివిజన్లలో పోటీ చేసి 33 గెలుపొందామన్నారు. పురానాపూల్ నుంచి నాలుగోసారి తమ అభ్యర్థి గెలిచారన్నారు. ఇది తమ పనితనానికి నిదర్శనమన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...!