అలుగు... ఇది అరుదుగా లభిస్తుంది. చూసేందుకు చిన్నపాటి ముసలిలా, పెద్ద తొండలా ఉంటుంది. వీటి శరీరం పెద్దపెద్ద పొలుసులతో కప్పి ఉంటుంది. వాణిజ్యపరంగా పొలుసులకు మంచి డిమాండ్ ఉండటంతో.... వీటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు వేటగాళ్లు ప్రయత్నిస్తుంటారు. పొలుసుల్లో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్, ఉబ్బసం వంటి రోగాలను నయం చేస్తాయని నమ్మకం. అలాగే వీటి మాంసం తింటే బాలింతలకు పాలు ఎక్కువగా పడతాయని శాస్త్రీయ నమ్మకం. అందుకే వేటగాళ్లు వీటిని పట్టుకుని అమ్మేస్తుంటారు.
యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు...
ఇలాంటి అరుదైన జంతువు గుంటూరు జిల్లాలో వేటగాళ్లకు పట్టుపడింది. యడ్లపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉయ్యాల కోటేశ్వరరావు, ఉయ్యాల శివయ్యతో పాటు మరో ఇద్దరు..... వలపన్ని అలుగుని బంధించారు. అయితే.... అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయించేందుకు అలుగును వీడియో తీసి యూట్యూబ్ లో అప్‌లోడ్ చేశారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు..... వ్యాపారుల మాదిరిగా మారువేషాల్లో వెళ్లి వారితో మాట కలిపారు. కోటి రూపాయల ధర చెప్పటంతో అధికారులు విస్తుపోయారు. ఎట్టకేలకు రూ.65లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అప్పుడే అలుగుని చూపించారు. నగదు తీసుకునేందుకు గుంటూరులోని ఓ ప్రాంతానికి రావాలని చెప్పారు. అధికారులు చెప్పిన ప్రదేశానికి రాగానే అక్రమ రవాణాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. శివయ్య, కోటేశ్వరరావు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఏడేళ్లు జైలు శిక్ష...
వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న అలుగుని మళ్లీ అడవిలో వదిలిపెట్టనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వణ్యప్రాణులను వేటాడటం, అక్రమంగా రవాణా చేయటం చట్టరీత్యా నేరమని... వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు.... రూ.10వేల వరకూ జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా