TET Exam: రేపు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు అర్హత కోసం పేపర్-1... ఆరు నుంచి ఎనిమిది వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అర్హత కోసం పేపర్-2 నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 వరకు... పేపర్-2 మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 51 వేల 468 మంది దరఖాస్తు చేసుకున్న పేపర్ వన్‌కు 1480 పరీక్ష కేంద్రాలు... 2 లక్షల 77 వేల 884 రాయనున్న పేపర్ టూ కోసం 1203 కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 1480 చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు, 13 వేల 415 మంది హాల్ సూపరింటెండెంట్లు, 29 వేల 513 మంది ఇన్విజిలేటర్లు, 252 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలు, మంచినీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష సమయం ముగిసే వరకు బయటకు వెళ్లేందుకు అనుమతించరు. బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే ఓఎంఆర్ పత్రాల్లో సమాధానాలను దిద్దాలని అధికారులు తెలిపారు. మొబైల్స్, బ్యాగులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
టెట్ ఫలితాలను ఈనెల 27న ప్రకటించనున్నారు. తాజా నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణత జీవితకాలం వర్తిస్తుంది. త్వరలో 13 వేల 86 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుండటంతో ఈ సారి టెట్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్సీటీఈ ఆదేశాల మేరకు ఈ ఏడాది బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 కూడా రాసేందుకు అర్హత లభించింది. అయితే బీఈడీ అర్హతతో ఎస్జీటీ ఉద్యోగంలో చేరితే.. రెండేళ్ల లోపు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. పేపర్-1కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు... పేపర్-2కు బీఈడీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఇవీ చదవండి: