రాష్ట్రంలో కొత్త రెవెన్యూ విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దసరా పండుగకు ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి... కంప్యూటర్ నిపుణులకు శిక్షణ పూర్తయ్యింది. తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా.. వర్షాల వల్ల వాయిదా పడింది.
రోజుకు 6లక్షలకు పైగా వివరాలు..
అటు వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 70 శాతం వరకు సర్వే పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతానికిపైగా, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వరకు పూర్తయింది. ఇప్పటివరకు 75 లక్షలకుపైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు. రోజుకు 6లక్షలకు పైగా ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నారు.
నాలుగు రోజులే సమయం..
ఇటీవల కురిసిన భారీవర్షాల వల్ల.. సర్వే కొంత ఆలస్యమైంది. హైదరాబాద్ నగరంలో ఈ ప్రభావం అధికంగా ఉంది. ఆస్తుల నమోదుకు ఇంకా 4 రోజుల గడువు మిగిలి ఉంది. ఈలోగా అన్ని ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత ఆ వివరాలను ధరణి పోర్టల్‌కు అనుసంధానించనున్నారు.
దసరా రోజున ప్రారంభం..
ఈనెల 25న ధరణి పోర్టల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహశీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సన్నద్దతతోపాటు కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై అవగాహన కల్పిస్తారు.
ఇవీచూడండి: ధరణి యాప్ వల్ల నష్టాలు లేవు... పుకార్లు నమ్మొద్దు: సీఎస్