గోదావరి నదిపై తెలంగాణా ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దంటూ ఏపీ కేంద్ర జల సంఘానికి గోదావరి నదీయాజమాన్య బోర్డు(GRMB)కు లేఖ రాసింది. ఐదు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణా పంపిన డీపీఆర్(DPR) లను ఆమోదించొద్దని కోరుతూ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఈ లేఖ రాశారు. సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు తో పాటు ముక్తేశ్వరం, చౌటపల్లి, మోడికుంటవాగు ప్రాజెక్టులకు అనుమతులను ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
అనుమతి మంజూరు చేయొద్దు..
ఈ ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను తెలంగాణా గోదావరీ నదీ యాజమాన్య బోర్డు(GRMB), కేంద్ర జలసంఘానికి సమర్పించినట్టు తెలిసిందని .. ఇవి అనధికార ప్రాజెక్టులుగా గుర్తించి వాటికి అనుమతి మంజూరు చేయొద్దని ఏపీ ఆ లేఖలో కోరింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతం దాదాపుగా 3 లక్షల 12 వేల 812 చదరపు కిలోమీటర్లుగా ఉందని మొత్తంగా ఈ ప్రాంతాన్ని 12 సబ్ డివిజన్లుగా విభజిస్తే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లు మాత్రమే బేసిన్ కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయని ఏపీ స్పష్టం చేసింది. భౌగోళికంగా నదీ ప్రవాహం ఎగువన ఉన్న తెలంగాణా నుంచి ఏపీలోకి వస్తున్నప్పటికీ శబరీ నదీ ప్రవాహం ఏపీ భూభాగం లోనే గోదావరితో వచ్చి జతకలుస్తోందని ఏపీ స్పష్టం చేసింది. బేసీన్ల ఆధారంగా అన్ని రాష్ట్రాలకూ గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ నీటి వాటాలను కేటాయించిందని తెలిపింది.
భౌగోళికంగా తనకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ తెలంగాణా ఏడాది పొడవునా గోదావరి నదీ నీటిని కేటాయింపులతో నిమిత్తం లేకుండా వాడుకుంటోందని పేర్కోంది. నీటి కేటాయింపుల ఆధారంగానే ఎగువ రాష్ట్రాలు జలాలను వినియోగించుకోవాలని దిగువ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించకుండా చూడాలని ట్రైబ్యునల్ స్పష్టం చేసిందని ఏపీ అందులో పేర్కోంది. 2016 జనవరి 21 తేదీన జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలోనూ తెలంగాణా నీటి వినియోగానికి సంబంధించిన ఒప్పందాలకు అంగీకరించిందని వెల్లడించింది. విభజన సమయానికి అందుబాటులో ఉన్న 1425 టీఎంసీల నీటిలో ఏపీకి 775 టీఎంసీలు, తెలంగాణా 649 టీఎంసీలు వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు పేర్కోంది.
తీవ్ర విఘాతం..
అయితే విభజన అనంతరం తెలంగాణా మరో 450 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టిందని ఏపీ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 225 టీఎంసీలు, తుపాకుల గుడెం, సీతారామ ఎత్తిపోతల, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, పెన్ గంగాపై బ్యారేజీల నిర్మాణం ఇలా వేర్వేరు ప్రాజెక్టులతో వీటి విస్తరణ ద్వారా మరో 255 టీఎంసీలను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఏపీ ఆరోపించింది. మొత్తంగా తెలంగాణా అనధికార ప్రాజెక్టులు, వాటి విస్తరణతో 1355 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇది దిగువ రాష్ట్రంగా ఏపీకి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని పేర్కోంది.
గోదావరిలో 1480 టీఎంసీల నీటిలో 967 టీఎంసీలను వినియోగించుకుంటామని నేరుగా ఆ రాష్ట్రమే గోదావరీ నదీ యాజమాన్య బోర్డు 9 వ సమావేశంలో వెల్లడించటంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలియచేసింది. గోదావరి నదిలో నీటి లభ్యతకు సంబంధించిన స్పష్టత రావటంతో పాటు ఏపీ, తెలంగాణాలకు సంబధించిన నీటి వాటాలను కొత్త ట్రైబ్యునల్ ఖరారు చేసేంత వరకూ తెలంగాణా ప్రాజెక్టుల డీపీఆర్ లను ఆమోదించవద్దని పేర్కోంటూ ఏపీ లేఖ రాసింది.
ఇదీ చూడండి:
Manikonda Man Missing Incident: మణికొండలో గల్లంతైన రజినీకాంత్ మృతదేహం లభ్యం
Manikonda Manhole Incident: రజినీకాంత్ కుటుంబానికి ప్రభుత్వ పరిహారం.. బాధ్యులపై చర్యలు