AP Unemployee JAC on YSRCP rajya sabha members: ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే పలువురు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఏపీ నిరుద్యోగ జేఏసీ తప్పుపట్టింది. వైకాపా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్, అక్క బత్తుల గిరీష్.. విశాఖపట్నంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి వినతిపత్రం అందించారు.
2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది. ఏపీ నిరుద్యోగులకు హైదరాబాద్లో ఉద్యోగ అవకాశం కలిగించమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కృష్ణయ్య కోరారా ? అని హేమంత్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణలోనే ఉద్యోగావకాశాలు ఇప్పించలేని కృష్ణయ్య.. రాజ్యసభకు వెళ్లి ఏం సాధిస్తారని అన్నారు. భాజపాను ఎదిరించి ఏపీ హక్కుల కోసం పోరాటం చేస్తారా ? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలరా ? అని హేమంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎందరో బీసీ నాయకులు, వందలాది మంది నిరుద్యోగ పోరాటాలు చేసిన నేతలు ఉన్నప్పటికీ.. వీరందరినీ కాదని తెలంగాణకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు కట్టబెట్టడం సరికాదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
భవిష్యత్ రాజకీయాల్లో రాష్ట్ర నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషిస్తుందని.. దీనికి కాపు ఉద్యమ నేత ముద్రగడ మద్దతు కావాలని జేఏసీ నాయకులు కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల 32 వేల ఉద్యోగాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: