Perni Nani on AP Financial Condition: ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉందని, అందుకే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామన్నారు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. ఆర్థిక పరిస్థితి నిజంగా బాగుంటే ఇంత మందితో ఎందుకు గొడవ పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు.
Perni Nani comments on AP financial condition : శనివారం రాత్రి సచివాలయం రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతూ.. మధ్యలో ఆయన ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న మహిళా ఉద్యోగులు కొందరు.. ఆయన దగ్గరకు వెళ్లి ఐఆర్ 27 శాతం ఇచ్చి.. ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించడమేమిటని అడిగారు. ఎప్పటి నుంచో ఉన్న హెచ్‌ఆర్‌ఏని ఇప్పుడు తగ్గించడమేమిటని ప్రశ్నించారు.
మహిళా ఉద్యోగినులు.. మంత్రి పేర్ని నానికి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది..
పేర్ని నాని : కొడుకు పదో తరగతిలో చేరినప్పుడు.. ఫస్ట్‌క్లాస్ తెచ్చుకుంటే స్కూటర్ కొనిస్తానని ఒక తండ్రి మాట ఇచ్చాడు. తీరా ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యేసరికి ఆ తండ్రి దివాళా తీశాడు. మా నాన్న స్కూటర్ కొనిస్తానని ఇవ్వలేదని కొడుకు తిట్టుకుంటే మాత్రం ఆయన ఏం చేయగలడు? సరిగ్గా ఏపీ ప్రభుత్వం పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది.
మహిళా ఉద్యోగులు : రాష్ట్రంలో 1.57 కోట్ల తెల్ల రేషన్‌కార్డు దారులు ఉన్నారు. వారంతా కూడా ఉప్పు, పప్పు కొని ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నారు కదా? వాళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కదా? మరి ప్రభుత్వం వాళ్లకేమీ చేయవద్దా?
పేర్ని నాని : ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు, తెచ్చిన అప్పులపై వడ్డీలు కట్టడానికే సరిపోతే.. మరి వాళ్ల సంక్షేమానికి ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం రుణం కూడా రూ.40 వేల కోట్లు మాత్రమే తేగలం.
మహిళా ఉద్యోగులు : మీరే ఏదో పెద్ద మనసు చేసుకుని హెచ్‌ఆర్‌ఏ పెంచాలి.
పేర్ని నాని : ఇది మనసుకి సంబంధించిన అంశం కాదు. గల్లా పెట్టెతో ముడిపడిన అంశం. ఇప్పుడు పెంచేస్తే నాలుగో నెలలోనో, ఐదో నెలలోనో జీతం ఇవ్వగలగాలి కదా? రెండు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి, తీరా రుణం తీర్చాల్సిన సమయానికి దివాళా తీస్తే.. వడ్డీ తగ్గించండంటూ బతిమాలుకుంటాం కదా? అలా ఉంది పరిస్థితి..