Power Cuts in Ap: ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న విద్యుత్ ఇబ్బందులు తాత్కాలికమేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనధికారిక కరెంటు కోతలు కొనసాగుతున్నాయంటూ ప్రజలూ, విపక్షాలూ ఆందోళన చేస్తున్న వేళ.. విద్యు కష్టాలపై ఆయన స్పందించారు. గృహ వినియోగానికి, వ్యవసాయ అవసరాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే.. పరిశ్రమల్లో కరెంట్ వాడకంపై ఆంక్షలు విధించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఏపీలో 230 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఉండగా.. 180 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతోందని శ్రీధర్ వెల్లడించారు.
పరిశ్రమలపై ఆంక్షలు విధించడం వల్ల.. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ భారం తగ్గుతోందని ఆయన చెప్పారు. అయినప్పటికీ.. మరో 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ నెల (ఏప్రిల్) చివరి వారం నాటికి విద్యుత్ ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని అయన చెప్పారు. మరీ అవసరమైతే తప్ప.. గృహ, వ్యవసాయ కరెంటులో కోతలు విధించొద్దని ఆదేశాలు ఇచ్చినట్టు ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. గ్రామీణ ప్రాంతాల్లో గంట సేపు, పట్టణ ప్రాంతాల్లో అరగంట సేపు కరెంటు కోతలు విధిస్తామని చెప్పారు. విద్యుత్ కొరత రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఇప్పటికీ కొనసాగుతోందన్న ఆయన.. గతంలో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేవని.. ఇప్పుడు మాత్రం నిల్వలు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఏరోజుకారోజు బొగ్గు సర్దుబాటు చేసుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు.
ఇదీ చదవండి:TSRTC Hikes Ticket Fare : ప్రయాణికులకు షాక్.. మరోసారి టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ