వారంలో పీఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తామంటూ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికీ దాన్ని ఉద్యోగులకు ఇవ్వలేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి(AP Secretariat Employees Union President Venkatramireddy) వ్యాఖ్యానించారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయటంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నివేదికను బహిర్గతం చేయకుండా పీఆర్సీపై అభిప్రాయాలను చెప్పలేమని అన్నారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్.. పీఆర్సీపై సీఎంను కలిశారని ఆయన తెలిపారు. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని అన్నారు. మైలేజ్ కోసమే కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని ఆరోపించారు. వేతన సవరణకు సంబంధించి ఉద్యోగులకు స్పష్టత ఉందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.
మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం...
ఉద్యోగ సంఘాల ఆందోళనతో రేపు మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయాలంటూ ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ బుధవారం సచివాలయంలో ఆందోళనకు దిగటంతో.. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు.
నివేదిక కాపీని ఇప్పించండి...
పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయకుండా... ఎందుకు దాస్తున్నారో తెలియడం లేదని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తమ డిమాండ్లను 11వ పీఆర్సీకి నివేదించామన్నారు. డిమాండ్లను పీఆర్సీ కమిటీ నివేదించిందో లేదో తెలియదన్న బొప్పరాజు... పీఆర్సీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. నివేదిక కాపీని ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్‌లో కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన