ఏపీలోని అంతర్వేదిలో దగ్ధమైన రథం స్థానంలో నిర్మించ తలపెట్టిన నూతన రథం నమూనాను మంత్రులు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి చూపించారు. పాత రథం కన్నా శ్రేష్టమైనది తయారు చేయించాలని, అందుకు నాణ్యమైన కలపను వినియోగించాలని స్వామి సూచించారు. అన్యాక్రాంతమైన అంతర్వేది దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. హైందవ సంప్రదాయాలపై అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఆరు ఆగమాలకు చెందిన పండితులతో ‘ఆగమ సలహా మండలి’ని ఏర్పాటు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర, వైకాపా నాయకులు పంచకర్ల రమేశ్‌బాబు, కె.కె.రాజు, సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తదితరులు వారి వెంట ఉన్నారు.
అంతర్వేది ఘటన దుష్టశక్తుల పనే: మంత్రులు
అంతర్వేదిలో రథం దగ్ధంతోపాటు ఇతర ఘటనలూ దుష్టశక్తుల పనేనని ఏపీ మంత్రులు శ్రీరంగనాథరాజు, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. శారదాపీఠాన్ని సందర్శించిన అనంతరం శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ... సీబీఐ విచారణలో నిజం నిగ్గు తేలుతుందని, మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తాను వినలేదని అన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసే నాయకులున్న పార్టీ తమను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
ఇదీ చదవండి: నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు.. రేపు గరుడవాహన సేవ