Merugu Nagarjuna Comments on nara Lokesh : ఏపీ సీఎం జగన్‌ను నారా లోకేశ్ ఏమైనా అంటే నాలుక కోస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ పాలనలోనే రాష్ట్రంలో ఎస్సీలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ఎస్సీ వ్యతిరేకి అంటూ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
‘జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్‌కు లేదు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం వైకాపా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీలపై దాడులు జరిగితే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని తెదేపా నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఆయన దేశానికి ఆణిముత్యాల్లాంటి నాయకులను అందించారు’ అని మంత్రి పేర్కొన్నారు.
నెల్లూరులో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. కమిషన్ వాళ్లేమీ దేవుళ్లు కాదని, వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థానిక పరిస్థితులు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు భయపడే ఏ నాయకుడూ పనికిరాడని అన్నారు.