పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు ముంపు ముప్పున్న భూములను వాడకూడదంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ముంపునకు తావున్న భూముల్లో స్థలాలిస్తే వారికి కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టు కాదా అని ప్రశ్నించింది. ఇళ్లస్థలాల పేరుతో చెట్లను నరికేందుకు ఏ చట్టం అనుమతిస్తోందని రెవెన్యూశాఖ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా చెట్లు కొట్టేస్తే... బాధ్యులైన అధికారులపై కేసుల నమోదుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. అధికారులు ఏం చేస్తున్నారో చూడకుండా కోర్టుపై నింద మోపుతున్నారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
అటవీ సంరక్షణ ప్రధానాధికారి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శిని వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి నోటీసులిచ్చింది. చెట్లు నరికివేతకు అధికారులకు అనుమతిలిచ్చారా? ఇస్తే సంబంధిత దస్త్రాలను కోర్టుకు సమర్పించాలని వారిద్దర్నీ ఆదేశించింది. ఇకపై చెట్లను నరకబోమంటూ అటవీశాఖ ప్రధానకార్యదర్శి హామీ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. నరికివేతను నిలువరించకపోతే అటవీచట్టాలు, సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనలకు ముఖ్యకార్యదర్శే బాధ్యులవుతారని హెచ్చరించింది. వ్యాజ్యంపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
చెట్లు కొట్టేసి భూమి చదును
విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామంలోని సర్వే నంబర్ 34/5 లో 3.96 ఎకరాల ముంపునకు తావున్న భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీకి యత్నిస్తున్నారంటూ గంగునాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదించిన శ్రీదేవి... ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వర్షాకాలం, వరదల సమయంలో పేదలు ఇబ్బందులు పడతారన్నారు. ప్రస్తుతం అక్కడ చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారన్న ఆమె సంబంధిత ఫొటోలను కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలుకు ఆదేశించింది.