AP HC On Cinema Tickets : సినిమా టికెట్ ధరల విషయంలో.. థియేటర్ల యాజమాన్యాలు సంయుక్త కలెక్టర్లను సంప్రదించిన తర్వాతే ధర నిర్ణయించాలంటూ తామిచ్చిన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని సినిమా థియేటర్లకు వర్తిస్తుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టతనిచ్చింది. ఈ వ్యవహారంపై హోంశాఖ ముఖ్య కార్యదర్శికి తగిన సూచన చేయాలని అడ్వొకేట్ జనరల్ని కోరింది. అదనపు వివరాల దస్త్రాలను సమర్పించేందుకు సమయం కావాలని.. హోంశాఖ తరపు న్యాయవాది కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఈఏడాది ఏప్రిల్ 8న హోంశాఖ జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ పలు సినిమా థియేటర్ యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. విచారణలో థియేటర్ల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పిటిషనర్లకే వర్తిస్తాయని హోంశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తామిచ్చిన ఆదేశాలు ఆ రాష్ట్రంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాలకు వర్తిస్తాయని తేల్చిచెప్పింది.
ఇదీ చదవండి: Yash KGF 2 Movie: 'కేజీఎఫ్' నుంచి స్పెషల్ వీడియో