High Court on Big Boss Show: రియాల్టీ షోల పేరుతో ఏదైనా ప్రదర్శిస్తామంటే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరించింది. ఇలాంటి వాటి విషయంలో తాము కళ్లుమూసుకుని ఉండలేమని వ్యాఖ్యానించింది. రియాల్టీ షోలలో హింసను ప్రోత్సహిస్తూ.. దాన్ని సంస్కృతి అని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. సీజే బెంచ్ ముందు ప్రస్తావించే వెసులుబాటును పిటిషనర్‌కు వదిలేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బిగ్‌బాస్ షో.. అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి ఇటీవల కోరడంతో అంగీకరించిన ధర్మాసనం.. సోమవారం విచారణ జరిపింది. ‘సరైన కారణం కోసం పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. రియాల్టీ షో పేరుతో ఏదైనా చూపిస్తామంటే ఊరుకునేది లేదు’ అని వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం 2019లో దాఖలైందని, పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యవసర విచారణ కోసం పది రోజుల కిందట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బెంచ్ ముందు అభ్యర్థించారన్నారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించలేదన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి స్పందిస్తూ.. సీజే బెంచ్ ముందు ప్రస్తావించిన మాట వాస్తవమేనన్నారు. ఇన్‌ఛార్జి కోర్టు ముందు విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. ఆ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సీజే బెంచ్ విచారించేందుకు నిరాకరించిన విషయాన్ని తమ ముందు నిజాయతీగా చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సీజే బెంచ్ వద్ద అత్యవసర విచారణ కోసం అభ్యర్థించే వెసులుబాటును పిటిషనర్‌కు వదిలేసింది.
ఇదీ చదవండి..
గ్రామీణ పేదలను కాటేస్తున్న గుడుంబా... బానిసలై కుటుంబాలు ఆగమాగం