AP High Court On TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 52 మందిని సభ్యులుగా నియమించామని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కాగా.. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆర్డినెన్స్‌పై పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
బోర్డు సభ్యుల్లో 18 మంది నేర చరిత్ర ఉన్నవాళ్లేనని.. వారిలో 16 మంది సభ్యులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కౌంటర్ దాఖలు చేయకపోవటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. లేదంటే నేరుగా విచారణ ప్రారంభిస్తామని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి : Husband Complaint To HRC On Wife: భార్య నుంచి ప్రాణహాని ఉంది.. హెచ్ఆర్సీకి ఓ భర్త మొర