అమరావతి రాజధాని వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది (AP High Court on three capitals cases). వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
రాజధాని వాజ్యాలపై వరుసగా ఆరో రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం విచారణ ప్రారంభించింది. పిటిషనరు తరఫు న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న సమయంలో అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి తెలియజేశారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు(ap govt repeal three capitals law).
ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రీపీల్ బిల్లును ధర్మాసనం ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు. తిరిగి హైకోర్టులో విచారణ ప్రారంభమైనా... అప్పటికీ శాసనసభలో ప్రభుత్వం ఈ బిల్లుల విషయంలో ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు సమర్పించేందుకు తమకు కొంత సమయం కావాలని ఏజీ కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం