ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి నామినేటెడ్ పదవుల(Nominated Posts) కోలాహలం మొదలైంది. సుమారు 80 కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్‌కు సగటున 12 మంది చొప్పున మొత్తం 960 మంది డైరెక్టర్ల నియామకంపై... ముఖ్యమంత్రి జగన్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైకాపా ప్రాంతీయ బాధ్యులుగా ఉన్న ఐదుగురు ముఖ్యనేతలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్న జగన్...జిల్లాల వారీగా రూపొందించిన అర్హుతల జాబితాలను పరిశీలించనున్నారు. ఛైర్మన్ల పేర్లు ఖరారు చేసి ఈ వారంలోనే ప్రకటించవచ్చని తెలుస్తోంది. డైరెక్టర్ల జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ, సర్దుబాట్లు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విధేయత, పార్టీకి అందించిన సేవల ఆధారంగా ఛైర్మన్ పదవులు భర్తీ చేస్తారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. అర్హత ఉండి కూడా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత దక్కనివారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. 2019 ఎన్నికల ముందు నియోజకవర్గ సమన్వయకర్తలుగా పనిచేసి, ఎమ్మెల్యే టికెట్ రానివారికి తర్వాత ప్రాధాన్యం ఉంటుంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడినవారు, ప్రస్తుతం నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నవారికి కూడా అవకాశం దక్కనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇక డైరెక్టర్ పదవులకు ఒక్కో ఎమ్మెల్యే నలుగురి పేర్లు సిఫార్సు చేసే అవకాశం ఇచ్చారు. 150 మంది ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 600 పేర్లతో జాబితా సిద్ధం చేశారు. డైరెక్టర్ పదవి ఆశించేవారు 2019 ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలని నిబంధన పెట్టినట్లు సమాచారం. అలాగే డైరెక్టర్ల ఎంపికలోనూ 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
ఇదీ చదవండి: CM KCR: పల్లెలు, పట్టణ ప్రగతే లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం