ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు కృష్ణా జిల్లా మైలవరం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు దేవినేనిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. హనుమాన్ జంక్షన్ నుంచి జూమ్ ద్వారా జడ్జి ఎదుట దేవినేనిని పోలీసులు హాజరుపరిచారు.
అంతకు ముందు ఉమాను..కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య హనుమాన్ జంక్షన్ తరలించారు. దేవినేనిని అరెస్టు చేసిన అనంతరం..ఉదయం 6 గంటలకు నందివాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి నందివాడలో హై అలర్ట్ నెలకొంది. దేవినేని ఉమాతో స్టేషన్ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్‌ను..అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. అయితే భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య..ఆయనను కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు.
ఇదీ జరిగింది..
ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలపై.. నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా, ఆయన అనుచరుల మీద.. రాళ్ల దాడి జరిగింది. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీసింది. పరిస్థితి చేయి దాటుతుండగా.. పోలీసులు లాఠీఛార్జి చేశారు.
తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ ఆందోళనకు దిగారు. సుమారు 6 గంటలపాటు కారులోనే కూర్చొని నిరసన తెలిపారు. కారు అద్దాలు పగులగొట్టి దేవినేనిని తమ వాహనంలోకి పోలీసులు ఎక్కించుకున్నారు. అనంతరం దేవినేనిని అరెస్టు చేసి పెదపారుపూడికి తరలించారు. అక్కడి నుంచి నందివాడ స్టేషన్‌కు తరలించారు. దేవినేనిపై అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్ కింద అభియోగాలు మోపారు.
మరో వైపు... అరెస్టైన తెదేపా నేతలు బోడె ప్రసాద్, పట్టాభిని వీరవల్లి తరలించాక విడిచిపెట్టారు. వీరవల్లి స్టేషన్‌లో నేతలను బాపులపాడు తెదేపా నాయకులు పరామర్శించారు. వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ వాతావరణంతో నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసుల నిర్బంధించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. నందివాడ వెళ్లేందుకు తెదేపా నేతల యత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఇవీచూడండి: