నివర్ తుపాను ప్రభావంపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావం, వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని తెలిపారు. తుపాను తీవ్రత తగ్గుతోందన్నారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని వివరించారు. కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయని అన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రికి తెలిపారు.
పెన్నాలో ప్రవాహం పెరగొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని సీఎంకు తెలియజేశారు. అక్కడక్కడా పంటలు నీటమునిగాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతంతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సాయం అందించడానికి సిద్ధం కావాలని సీఎం వెల్లడించారు.