cm response on bus accident: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేయగా.. సీఎం సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పరిహారాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సూచించారు.
బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై ఆయన ఏపీ సీఎస్‌తో మాట్లాడి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.
బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం అత్యంత బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఘటన జరిగిన ప్రాంత సమీపంలో ఉన్న పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించటంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానూభూతి తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే..
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలంలో ఉదయం 8.30కు బయలుదేరిన జంగారెడ్డిగూడెం బస్సు.. ఆ మండలం పరిధిలోని జల్లేరు వద్ద వంతెన రెయిలింగ్‌ను ఢీకొంది. అదుపుతప్పి ఒక్కసారిగా 25 అడుగులు లోతు ఉన్న వాగులో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదస్థలిలోనే బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్రజలు సహాయక చర్యలకు ముందుకొచ్చారు. మృతిచెందిన వారిని బస్సు కిటికీల నుంచే బయటకు తీశారు. కిటికీల నుంచి కొందరు ప్రయాణికులు బయటకు వచ్చారు. మిగిలిన ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఘటనాస్థలిలో.. ఆర్డీఓ, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయచర్యలు చేపట్టి బస్సును వాగులో నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బస్సులోపలే ఉండిపోయినవారిని.. స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు.. అతివేగంతో రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.
విచారణకు ఆదేశం..
బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై మంత్రి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత కథనం..