తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. తితిదే అర్చకులు సీఎం జగన్‌కు తలపాగా అలంకరించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలతో బయలుదేరిన సీఎం... స్వామివారికి సమర్పించారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్ గరుడవాహన సేవలో పాల్గొంటారు.
దిల్లీ నుంచి తిరుమలకు సీఎం
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వచ్చిన సీఎంకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. తిరుమలలో సీఎం జగన్‌కు... పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో స్వాగతం పలికారు. సీఎం పర్యటనతో మంత్రులు సుచరిత, వెల్లంపల్లి, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తిరుమల చేరుకున్నారు. డిక్లరేషన్ వివాదంతో తిరుమల పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
గురువారం కార్యక్రమాలు
రేపు ఉదయం కర్ణాటక సీఎంతో కలిసి సీఎం జగన్ మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం నాదనీరాజనంపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ రేపు ఉదయం 8.10 గం.కు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి భూమిపూజ చేయనున్నారు.
ఇదీ చదవండి : మోదీ సతీసమేతంగా పూజలు చేశారా?: కొడాలి నాని