విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, మూడు రాజధానులు, రాజధాని భూములు, ఏపీ ఫైబర్ నెట్, కోర్టు కేసులు తదితర అంశాలపై అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ చర్చించినట్లు తెలిసింది. కొన్ని వినతిపత్రాలు ఇచ్చినట్లు సమాచారం. 7.40 గంటలకు సీఎం జగన్ బయటకు వచ్చారు. ఆయనతోపాటు ఎంపీ బాలశౌరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ హోం మంత్రి నివాసంలోకి వెళ్లారు. బుధవారం ఉదయం 10.30కు మరోసారి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం.
జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో బుధవారం ఉదయం 9 గంటలకు జగన్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత హోం మంత్రి వద్దకు వెళ్తారు. సీఎంతో పాటు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయవాది భూషణ్, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, జీవీడీ కృష్ణమోహన్, పరమేశ్వర రెడ్డి, వేణుగోపాల్ దిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, మార్గాని భరత్, బాలశౌరి, ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, గోరంట్ల మాధవ్ తదితరులతో సమావేశమయ్యారు.
సాయంత్రం 6 గంటల సమయంలో లోక్‌సభలో బిల్లుపై చర్చలో పాల్గొనాల్సి రావడంతో ఎంపీ భరత్ సభకు వెళ్లగా విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఏపీ భవన్‌కు చేరుకున్నారు. పీఎంవో ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రతో ఎంపీలిద్దరూ ఏపీ భవన్ నుంచి వీడియో సమావేశం ద్వారా చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం సుమారు గంటన్నర సేపు జరిగింది. అమిత్ షాను కలిసిన సందర్భంగా సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న అమిత్‌షాను పరామర్శించారు. హోం మంత్రితో భేటీ అనంతరం సీఎం జగన్ నేరుగా అధికారిక భవనం 1 జన్‌పథ్‌కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన దిల్లీ నుంచి బయల్దేరి తిరుపతి వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు