ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా.. పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉంది. అపాయింట్మెంట్లు ఖరారైన వెంటనే ఆ సమయాన్ని బట్టి బయలుదేరి వెళ్తారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని ఏపీ సీఎం కోరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియ ఆరంభించాలని మరోమారు అమిత్ షాను కోరనున్నట్లు తెలిసింది.
ఉగాది నాటికి విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటిలోపు న్యాయస్థానాల్లోనూ విచారణ పూర్తవుతుందని అంచనా వేస్తోంది. ఈ లోపు కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే విభజన చట్టంలోని పలు అంశాల పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులపై హోం మంత్రితో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి