రాష్ట్రంలో రెండురోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈశాన్య మధ్యప్రదేశ్.. ఉత్తర ఛత్తీస్గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. దానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తూర్పు-పశ్చిమ షేర్ జోన్ వెంబడి మధ్య భారతదేశం మీదుగా 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని పేర్కొంది. ఫలితంగా బుధవారం.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఉంటుందని వెల్లడించింది.
ఇవీచూడండి: ఓరుగల్లు అతలాకుతలం.. ఇంకా జలదిగ్బంధంలోనే అనేక ప్రాంతాలు