Women Behind Amaravati Udhyamam: అవమానాలు, నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, కేసులు, వేటికీ వెనుకాడలేదు వాళ్లు. కరోనా పడగ విప్పుతున్నా పోరు ఆపలేదు. 2019 డిసెంబరు 17న మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచే.. రోడెక్కి జై అమరావతి అంటూ నినదించారు. రాజధాని గ్రామాలను పోరాట గడ్డగా మలచి హోరెత్తించారు. 2019 డిసెంబరు 17అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. రాజధాని కోసం తమ భూములు ఇచ్చి... భవిష్యత్ ఏంటో తెలియని నిస్సహాయ పరిస్థితుల్లో 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. అప్పటివరకు ఇళ్ల నుంచి ఎప్పుడూ బయటకు రాని అమరావతి మహిళలు... కుటుంబంతో పాటు బిడ్డల భవిష్యత్తుకూ కష్టం వస్తే ఉండలేకపోయారు. తాడోపేడో తేల్చుకోటానికి ఉద్యమబాటపట్టారు. ఎన్నిరోజులైనా శిబిరంలోనే ఉంటాం.. అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు వెనక్కుతగ్గబోం అని కంకణం కట్టుకున్నారు. పోలీసుల నిర్బంధాలు లాఠీలకు వారు బెదరలేదు. ఇనుప కంచెలను తోసుకుని ముందుకు వెళ్లి తెగువ చూపారు. విభిన్న రూపాల్లో ఉద్యమాన్ని నిర్మించి.. సుదీర్ఘ పోరాటం చేశారు.
భయపడకుండా అనుకున్నది సాధించారు...
మహిళా పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేయిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేసినా సహనంతో భరించారు. శాంతియుతంగానే నిరసన తెలిపారు. టెంటు వేసుకోటానికి పోలీసులు అనుమతించకున్నా... మండుటెండలోనే కూర్చుని నిరసన తెలిపారు. ఉద్యమంలో భాగంగా సచివాలయం ముట్టడి, హైవే దిగ్బంధనం వంటి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం రోజు కనకదురమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న మహిళలను పోలీసులు అడుకున్నా.. భయపడకుండా పోరాటం సాగించారు.
మహాపాదయాత్రకు వెన్నుదన్నుగా నిలిచిన నారీమణులు
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ప్రతి సందర్భంలోనూ ముందుండి కదంతొక్కిన నారీమణులే తుళ్లూరు నుంచి తిరుమల వరకు సాగిన 45రోజుల సుదీర్ఘ మహాపాదయాత్రకు.. వెన్నుదన్నుగా నిలిచారు. అమరావతే ఏకైక రాజధాని అంటూ.... ఉప్పెనలా ముందుకు కదిలారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్రను ముందుండి నడిపించారు.
రెండేళ్ల పోరాటంలో మహిళలదే కీలకపాత్ర..
రెండేళ్ల పోరాటంలో చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలలో మహిళలదే కీలకపాత్ర. అసెంబ్లీ ముట్టడి జాతీయ రహదారి దిగ్బంధనం, దుర్గమ్మ దర్శనం ఇలా వివిధ సందర్భాల్లో రాజధాని ప్రాంతం రణరంగాన్నే తలపించింది. ఉద్యమాన్ని అణగదొక్కాలనే ప్రయత్నాలను అడ్డుకుంటూ... ప్రతీ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తమ అవేదనని వినకుండా అణచివేసే ప్రయత్నాలు వారిలో పట్టుదలని పెంచాయి. పోరాటంలో విజయంవైపు అడుగులు వేయించాయి.
ఉద్యమ నిర్మాణంలో ఎన్నో కష్టాలు
సచివాలయం, కోర్టు ముట్టడిలు, హైవే దిగ్బంధనం వంటి ఆందోళనల్లో కీలక భూమిక పోషించారు. గత ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం రోజు కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నా... అనుకున్నది సాధించారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ అనే నినాదంతో 45 రోజుల సుదీర్ఘ పాదయాత్రను ముందుండి నడిపించారు.
ఇదీ చదవండి: 'అన్ని సందర్భాల్లోనూ భార్య.. భర్తకు విధేయంగానే ఉండాలి'