Andhra pradesh retired employees problems : ప్రభుత్వోద్యోగం అంటే నెల జీతం మాత్రమే కాదు.. పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీ పింఛనుతో పాటు.. తాము ఆదా చేసుకున్నదంతా పెద్దమొత్తంలో ఒకేసారి వస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలులాంటి పెద్ద ఖర్చులు దాంతో తీరుతాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నాళ్లుగా పరిస్థితి తలకిందులైంది. పదవీ విరమణ ప్రయోజనాలు సమయానికి అందక చాలామంది విశ్రాంత ఉద్యోగులు సతమతమవుతున్నారు. పీఎఫ్, ఇతర సొమ్ములు ఎన్నాళ్లయినా జమ కావడం లేదు. పదవీ విరమణ చేసినవారికి ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సింది సుమారు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇతర బకాయిలూ కలిపితే రూ.2,100 కోట్లు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గతేడాది జూన్, జులై నెలల్లో పదవీ విరమణ చేసినవారికీ ఇంతవరకూ ప్రయోజనాలు అందలేదు. ఏప్రిల్‌లోపు క్రమేణా చెల్లిస్తామని అధికారులు అంటున్నారు.
నిర్దిష్ట గడువేదీ?: పదవీ విరమణ తర్వాత ప్రతి ఉద్యోగికి కమ్యుటేషన్, గ్రాట్యుటీ, పింఛను ఇస్తారు. నిజానికి ఉద్యోగి పదవీ విరమణ గడువుకు 4నెలల ముందే ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి పంపి పింఛను ఖరారుకు ఏర్పాట్లుచేయాలి. పింఛను చెల్లింపులో జాప్యం జరగకూడదని 2018 జూన్ 27న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాని ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ఆ తర్వాతి నెల ఒకటో తేదీన పింఛను చెల్లించాలి. ఇంకా ఆర్జిత సెలవు కింద గరిష్ఠంగా దాదాపు 10నెలల వేతనం రిటైరైన ఉద్యోగికి అందుతుంది. ప్రీమియాన్ని, జీతాన్ని బట్టి ఏపీ జీఎల్‌ఐ (జీవిత బీమా) మొత్తం అందుతుంది. గ్రూప్ ఇన్సూరెన్సు కింద మరికొంత మొత్తం వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి ఎంత నిల్వ చేసుకుంటే అంత మొత్తం చెల్లించాలి. ప్రస్తుత రోజుల్లో చెల్లింపునకు గడువంటూ లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. లోగడ పదవీ విరమణ చేసిననాడే ఉద్యోగికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తూ వారికి ఎంత మొత్తం అందుతుందో చెక్కు రూపంలో ఇచ్చేవారమని జలవనరుల శాఖలో పాలనా వ్యవహారాలు చూసే అధికారి ఒకరు చెప్పారు.
- గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఒక హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు 2021 జులైలో పదవీ విరమణ పొందారు. డిసెంబరులో పింఛను మొత్తం ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పటికీ పీఎఫ్, ఆర్జిత సెలవుల సొమ్ము అందలేదు. పదవీ విరమణ చేసిన వారికి ఎన్నో అవసరాలుంటాయని, నెలల తరబడి ఇలా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన వాపోయారు.
- గుంటూరు జిల్లాలో ఒక మండల విద్యాధికారిగా పని చేసి జూన్‌లో పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగిది కూడా ఇలాంటి వ్యథే. పీఎఫ్ సొమ్ములు అందలేదు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచరు జూన్ నెలాఖరున పదవీ విరమణ చేశారు. గ్రాట్యుటీ అందలేదని ఆయన చెబుతున్నారు.
- ఆయన కీలకమైన ప్రభుత్వ శాఖలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిగా పనిచేసి 6నెలల కిందట పదవీ విరమణ పొందారు. ప్రభుత్వంనుంచి ఆయనకు రావాల్సిన ప్రయోజనాలు ఇప్పటికీ దక్కలేదు. పింఛను ఖరారు చేసి ఇటీవలే చెల్లించారు. జీపీఎఫ్, కమ్యుటేషన్, జీఎల్‌ఐ, సముపార్జిత సెలవు మొత్తం, గ్రూపు ఇన్సూరెన్సు మొత్తాల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.
కడప జిల్లా కమలాపురం మండలంలో జడ్పీ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు ఒకరు గతేడాది జూన్ నెలాఖరున పదవీ విరమణ పొందారు. పింఛను, కమ్యుటేషన్ వంటివి ఆలస్యంగానైనా అందాయి. ఇప్పటికీ పీఎఫ్, ఆర్జిత సెలవుల సొమ్ము ఇవ్వలేదు. ఆ డబ్బులొస్తే ఇంటి రుణం తీర్చేద్దామని వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: APSRTC YSR Employees Union: 'పీఆర్సీ సమ్మెలో పాల్గొనం'