Ap Cm Jagan: భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ వంటి జీవ, హరిత ఇంధనాల ఉత్పత్తిని పెంచడం అత్యవసరమని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వాటి ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అవకాశాలున్నాయని, అందువల్ల దీనికి రాష్ట్రం కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. అన్నదాతలు ఇంధన ప్రదాతలుగా మారాలన్నారు. టన్ను బియ్యం నూకతో 480 లీటర్ల బయో ఇథనాల్ తయారు చేయొచ్చని.. అలాంటి ప్రాజెక్టులు దేశంలో 150 వరకు నిర్మాణదశలో ఉన్నాయని వివరించారు. పెట్రోలు ధర లీటరు రూ.110 అయితే, ఇథనాల్ రూ.62కే వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బియ్యానికి కొరత లేదని.. కాబట్టి ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్‌ల ఉత్పత్తికి ఏపీని కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చుట్టుపక్కల చాలా పరిశ్రమలు పామోలిన్ వ్యర్థాలతో బయో డీజిల్ ఉత్పత్తి చేస్తున్నాయని గడ్కరీ గుర్తు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి.. మొత్తం రూ.21,559 కోట్లతో రాష్ట్రంలో పూర్తయిన 21 జాతీయ రహదారుల ప్రాజెక్టుల్ని జాతికి అంకితం, 30 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
మురుగునీటి నుంచి హరిత హైడ్రోజన్..
‘డీజిల్ లీటరు రూ.100 ఉంటే, సీఎన్‌జీ రూ.60కి, ఎల్‌ఎన్‌జీ రూ.40కి వస్తుంది. త్వరలో ఎలక్ట్రికల్ ట్రక్కుల్ని ప్రారంభిస్తున్నాం. టయోటా సంస్థ గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే కారును తయారుచేసింది. వచ్చేవారం ప్రారంభిస్తోంది. మురుగునీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయవచ్చు. నాగపుర్ నగరపాలక సంస్థ మురుగునీటిని విద్యుదుత్పత్తి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి అమ్మి, ఏటా రూ.325 కోట్లు సంపాదిస్తోంది. రోప్‌వే, కేబుల్‌కార్లు వంటి విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. హిమాచల్‌ప్రదేశ్‌కు 16, ఉత్తరాఖండ్‌కు 15 ప్రాజెక్టులు ఇచ్చాం. ఏపీకి కూడా కావాలంటే ఇస్తాం’ అని గడ్కరీ పేర్కొన్నారు.
రూ.3 లక్షల కోట్లతో ఎన్‌హెచ్‌ల నిర్మాణం..
‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఏపీ పాత్ర కీలకం. రాష్ట్రంలో రెండు మేజర్ పోర్టులున్నాయి. ఏపీలో 2024 చివరికి జాతీయ రహదారుల నిర్మాణంపై రూ.3 లక్షల కోట్లు వెచ్చించనున్నాం. నా శాఖకు నిధుల కొరత లేదు. 22 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ఏపీ మీదుగా రాయ్‌పూర్-విశాఖ, నాగపుర్-విజయవాడ, చిత్తూరు-తట్చూరు, హైదరాబాద్- విశాఖపట్నం, బెంగళూరు-చెన్నై ప్రాజెక్టులు ఉన్నాయి. విజయవాడకు తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతున్నాం. 50 శాతం భూసేకరణ ఖర్చు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మినహాయింపు ఇస్తున్నాం. వీటి నిర్మాణంలో వినియోగించే ఉక్కు, సిమెంట్‌పై జీఎస్టీకి మాత్రం మినహాయింపు ఇవ్వాలి. లాజిస్టిక్ పార్క్‌లకు ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలి’ అని గడ్కరీ పేర్కొన్నారు. సీఎం 20 ఆర్వోబీలు అడిగితే 30 ఇస్తున్నానని ప్రకటించారు.
హైవేలపై వేగ నియంత్రణ నిబంధనలు మార్చాలి..
దేశ ఆర్థికాభివృద్ధికి ఓడరేవులు, జలమార్గాలు ఎంత అవసరమో.. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించే యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ హైవేలు కూడా అంతే ముఖ్యమని గడ్కరీ చెప్పారు. దిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవేపై ఇటీవల ట్రయల్ వెళ్లానని, 160 కి.మీ.ల వేగంతో ప్రయాణించినా చాలా సౌకర్యంగా ఉందన్నారు. ‘ఈ హైవేలపై వేగ నియంత్రణకు నిబంధనల్ని మార్చాలి. సరకు రవాణా ఖర్చు చైనాలో 8-10 శాతం, ఐరోపా దేశాలు, అమెరికాలో 12 శాతం ఉంటే మన దేశంలో 16-18 శాతం ఉంది. మన ఎగుమతులకు అదే పెద్ద అవరోధం. రవాణా ఖర్చును 8-10 శాతానికి, వీలైతే ఆరు శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. ముడి చమురు, గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి దేశం ఏటా రూ.8లక్షల కోట్లు ఖర్చుచేస్తోంది. అయిదేళ్లలో అది రూ.25 లక్షల కోట్లకు చేరుతుంది. ఈ దిగుమతుల్ని గణనీయంగా తగ్గించాలంటే జీవ, హరిత ఇంధనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.
32 ఏళ్లకే పీఎంజీఎస్‌వై పథకం రూపొందించా..
‘నేను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని వాజపేయీ పిలిచి, గ్రామాల్ని అనుసంధానం చేసే రహదారుల పథకం రూపొందించమని ఆదేశించారు. అలా నా అధ్యక్షతన రూపొందిందే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై). అప్పటికి నా వయసు 32 ఏళ్లు. ప్రస్తుతం అది కేంద్ర ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటి’ అని తెలిపారు.
కొందరు అవకాశాలను సమస్యలుగా మార్చుకుంటారు..
పోలవరం ప్రాజెక్టుకు అప్పట్లో అనేక సవాళ్లుంటే కాంట్రాక్టర్‌ను మార్చి, 80 శాతం నిర్మాణం పూర్తి చేశామని గడ్కరీ చెప్పారు. కొంత మంది సమస్యలను అవకాశాలుగా మలుచుకుంటారు.. మరికొందరు అవకాశాలను సమస్యలుగా మార్చుకుంటారని వ్యాఖ్యానించారు. ‘నేను మహారాష్ట్రలోని వెనుకబడిన విదర్భ ప్రాంతానికి చెందినవాడిని. అక్కడ ఇప్పటికి 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాకు మూడు పంచదార మిల్లులు ఉన్నాయి. ఎప్పుడూ నష్టాలే. అవన్నీ చూసినవాడిని కాబట్టే ఒక రైతుగా పోలవరం ప్రాజెక్టుతో నాకు భావోద్వేగపూరిత అనుబంధం ఉంది. నేను జలవనరులశాఖ మంత్రిని కాకపోయినా, పోలవరం పూర్తయ్యాక వచ్చి చూస్తాను. నాకు అదో సంతృప్తి’ అని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు.
అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఏ రాష్ట్రంపైనా వివక్ష ఉండకూడదని.. ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రహదారి, రైలు, విమాన, సముద్ర కనెక్టివిటీకి ప్రధాని అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. రూ.60 వేల కోట్లతో ఈశాన్య రాష్ట్రాల్లో రహదారి అనుసంధాన పనులు చేస్తున్నాం. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే, 32 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానత ఏర్పడింది. హైదరాబాద్‌లో రీజనల్ రింగ్ రోడ్ మంజూరు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఏపీలో రూ.7,500 కోట్లతో 14 కేంద్ర విద్యాసంస్థలు అభివృద్ధి చేశారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా శ్రీశైలంలో మౌలిక వసతులకు నిధులు వెచ్చించాం. సింహాచలం, అన్నవరం ఆలయాలు అభివృద్ధి చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు మ్యూజియంను విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు కేంద్రం తరఫున నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. ఏపీతోపాటు హైదరాబాద్, దిల్లీలో కూడా నిర్వహిస్తాం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2024 నాటికి పూర్తిచేస్తామన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణానికి నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ సీఈవో ప్రకాశ్ కౌర్, రాష్ట్ర పరిశ్రమలశాఖ తరపున రజత్‌భార్గవ్, జి.సృజన ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. ఈ రెండు చోట్లా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించగా, ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ లాజిస్టిక్ పార్కులను నిర్మించనుంది.
ఇదీ చూడండి : KTR At Kandlakoya IT Park: కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ వచ్చేదా: కేటీఆర్