జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి(ap cm jagan news) ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట గన్నవరం విమానాశ్రయం నుంచి వస్తుండగా.. విజయవాడలోని ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లో విపరీతమైన దర్వాసన వచ్చింది. జగన్ ఈ విషయమై ఆయన కార్యాలయం అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంవో నుంచి సచివాలయం అధికారులకు.. అక్కడి నుంచి కృష్ణా జిల్లా కలెక్టరుకు ఆదేశాలు చేరాయి.
అధికారుల స్పందన
వెంటనే ఉన్నతాధికారుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. ఆటోనగర్ నుంచి వచ్చే మురుగు ప్రసాదంపాడు, ఎనికేపాడులో నిల్వ ఉంటోందని గమనించిన అధికారులు.. పక్కా డ్రైనేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. జాతీయ రహదారికి రాకుండా ఆటోనగర్ నుంచి నిడమానూరు మీదుగా మురుగునీటిని మళ్లించాలని తెలిపారు. ఆటోనగర్ వద్ద పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సూచనలు
జాతీయరహదారి వెంట వీధిదీపాలు వెలగకపోవడంపై ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్, గవర్నర్, కేంద్ర మంత్రులు విమానాశ్రయం నుంచి నగరం మీదుగా సచివాలయం, ఇతర ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉన్నందున.. వీధి దీపాలు, మురుగు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.
రోడ్ల విషయంపై సమీక్ష
ఏపీలోని రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై ఏపీ సీఎం జగన్ సమీక్ష (CM Jagan review) సోమవారం నిర్వహించారు. రోడ్ల మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించాలని సంబంధిత శాఖ అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏపీలో రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని దిశానిర్దేశం చేశారు. రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధితశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఫలితంగా వాహనదారులకు చక్కని రోడ్లు అందుబాటులోకి తేవాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై నిర్వహించిన సమీక్షలో (CM JAGAN REVIEW ON ROADS) జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. ఏపీలో 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టాలని సూచించారు. రోడ్ల మరమ్మతులను రాష్ట్రమంతా డ్రైవ్‌లా చేపట్టాలని అన్నారు.
వారిని బ్లాక్ లిస్టులో పెట్టండి...
జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలని, ఏపీలో రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ ఆదేశించారు. గుంతలు పూడ్చాక కార్పెటింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని తెలిపారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ ఏపీకి వస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామని జగన్ అన్నారు.
ఇదీ చూడండి: యువతికి నిప్పంటించిన ఉన్మాది.. హర్షవర్దన్ మృతి