తెలంగాణ రాష్ట్రంలో 2 వేల 216 మద్యం దుకాణాలున్నాయి. వీటికి వచ్చే నెల చివరి నాటికి లైసెన్స్ గడువు ముగియనుంది. కొత్త లైసెన్స్‌ల ఎంపికపై ఆబ్కారీ శాఖ దృష్టి సారించింది. అక్టోబరు ఒకటో తేదీ నాటికి కొత్త లైసెన్స్‌ల ఎంపిక కూడా పూర్తి కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దుకాణాల్లో సగానికి సగం తగ్గించి ప్రభుత్వమే నిర్వహించాలని... ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అక్కడి లిక్కర్ వ్యాపారులు తెలంగాణలోని మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది.
పెరగనున్న దరఖాస్తు రుసుము
దరఖాస్తు చేసుకునే వాళ్లు... లక్ష రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కొత్తగా తీసుకురానున్న మద్యం విధానంలో మార్పులు చేసి పోటీ తత్వాన్ని తగ్గించేందుకు ఇప్పుడు లక్ష రూపాయలు దరఖాస్తు రుసుమును రెండు లక్షలు చేయాలని యోచిస్తున్నారు. 2017లో 2 వేల 216 మద్యం దుకాణాలకు ఒక్కో దుకాణానికి దాదాపు 19 దరఖాస్తుల లెక్కన 41 వేల 119 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా దరఖాస్తుల రుసుం కిందనే రూ.411.90 కోట్ల రాబడి వచ్చింది. తాజాగా మరో వందకుపైగా మద్యం దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆంధ్ర వ్యాపారులు పోటీ పడే అవకాశం!
ఆంధ్ర లిక్కర్ వ్యాపారులు కూడా దుకాణాలు దక్కించుకోడానికి పోటీ పడే అవకాశం ఉండడం వల్ల మరో పదివేలు అయినా అదనంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. 50 వేలకుపైగా దరఖాస్తులు వస్తే... అధికారులు భావిస్తున్నట్లు ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలు తిరిగి ఇవ్వని డిపాజిట్ తీసుకున్నట్లయ్యితే వెయ్యి కోట్లు ప్రభుత్వానికి వస్తుందని ఆబ్కారీ శాఖ వెల్లడించింది.
నూతన మద్యం విధానంపై కసరత్తు
నూతన మద్యం విధానంపై ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న కసరత్తు ఈ నెలాఖరు నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అనుకున్నట్లు జరిగితే మద్యం దుకాణాల సంఖ్య 2వేల 216 నుంచి 2వేల 300లకు పైగా రెట్టింపుకానుంది.
ఇవీ చూడండి: ప్రాణ భయంతో రాత్రంతా చెట్టుపైనే గర్భిణి