అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రంక్ పెట్టెల్లో బంగారు, వెండి, నగదు వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తండ్రి చనిపోగా ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా పొందిన మనోజ్ కుమార్... ఖజానా శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా పదమూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మనోజ్ కుమార్ అక్రమాస్తులు కూడబెట్టడం మొదలుపెట్టాడు. తాను కూడబెట్టిన అక్రమ సంపాదన మొత్తం ట్రంకుపెట్టెలో పెట్టి, సీలు వేసి తన డ్రైవర్ నాగలింగం ఇంట్లో దాచాడు మనోజ్ కుమార్. మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో నాగలింగం ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా..అసలు విషయం బయటపడింది.
తవ్వేకొద్దీ అక్రమాస్తులు
ఇంట్లో తుపాకులు ఉన్నాయనే సమాచారంతో మంగళవారం సాయంత్రం బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని నాగలింగం ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎస్సైలు, అనేకమంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. నాలుగు ట్రాక్టర్లు, కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్థిరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మనోజ్‌కు భార్యతో తగాదాలు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
ఓ జాతీయ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న భార్యను, మనోజ్ శారీరకంగా హింసించేవాడని పోలీసులు తెలిపారు. అతనిపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయని చెప్పారు. నలుగురు యువకులను మనోజ్ వ్యక్తిగత అంగరక్షకులుగా నియమించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ కేసును ఆదాయపన్న శాఖకు లేక అనిశాకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
ట్రంక్ పెట్టెల్లో
డ్రైవర్ నాగలింగం ఇంట్లో దొరికిన 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు గుర్తించారు. రూ.27 లక్షలు విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49 లక్షల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు దొరికాయి. 6 బైక్‌లు, 3 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు, రూ.లక్షల విలువైన మరో ద్విచక్రవాహనం 4 ట్రాక్టర్లు, 2 అత్యాధునిక కార్లు గుర్తించారు.
డ్రైవర్ నాగలింగం, అతని మావయ్య బాలప్పలతో సహా మనోజ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమ సంపాదనపై గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌ను అరెస్టును పోలీసులు ధ్రువీకరించలేదు.
ఇదీ చదవండి : 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు