Old woman in Struggle and seeking for help: ఓ వృద్ధురాలు.. ఇద్దరు కుమార్తెలతో జీవచ్ఛవాలుగా బతుకుతున్న దయనీయ స్థితి ఏపీ ప్రకాశం జిల్లా కనిగిరిలోని బొగ్గులగొంది కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకునేందుకు బట్టలూ లేక.. శరీరం సహకరించక జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
వృద్ధురాలు రహమత్ బీకి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురికీ వివాహాలు చేసింది. కుమార్తెలు సాబీరా, జిలాని బేగంలను తమ భర్తలు, అత్తింటివారు వదిలేయడంతో మరో దారిలేక తల్లి వద్దకే చేరారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారటంతో భారాన్ని మోయలేక కుమారుడు తన భార్యాపిల్లలను తీసుకుని ఎటో వెళ్లిపోయాడు. మీదపడుతున్న ముసలితనం, ఆర్థిక భారం ఆ కన్నప్రేమ ముందు చిన్నబోయాయి. వస్తున్న వృద్ధాప్య పింఛనుతోనే ఆరోగ్యం బాగాలేని ఇద్దరి కుమార్తెలను పసిపిల్లలా సాకుతోంది ఆ తల్లి. అర్థాకలితోనే వారు పొట్ట నింపుకుంటూ.. దయనీయ స్థితిలో జీవితం గడుపుతున్నారు. సాయం చేసే చేతుల కోసం ఆశగా చూస్తున్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం సాబీరాను గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారు ప్రాంతంలో ముళ్ల చెట్ల మధ్య వదిలి వెళ్లిన విషయం విదితమే. సమాచారం అందుకున్న ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు వెంటనే స్పందించి వైద్యశాలలో చేర్పించి ఆమె ప్రాణాలు నిలిపారు. ఈ విషయమై కనిగిరి తహసీల్దార్ పుల్లారావు విచారణ చేపట్టగా వీరి దుస్థితి వెలుగులోకి వచ్చింది. స్పందించిన తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి వృద్ధురాలి ఇంటికి వెళ్లి ప్రభుత్వ ఫలాలు తక్షణమే అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా కొంత నగదు, నిత్యావసర వస్తువులను అందించారు. ఈనాడు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన స్థానికులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని వైద్య పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: