నదుల్లో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విధానాన్ని పున:సమీక్షించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోరారు. అందుబాటులో ఉన్న జలాల్ని ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా ప్రకారం వాడేసుకోవటం వల్ల దిగువ రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రస్తావించారు. 15 రోజులకోసారి నదుల్లో నీటి లభ్యతను సమీక్షించుకుని, ఆయా రాష్ట్రాలకు నిర్ణయించిన కేటాయింపుల దామాషాలో నీటి పంపిణీ జరగాలని జగన్ ప్రతిపాదించారు. సమావేశంలో 26 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది.
పోలవరం ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ ప్రకారం కేంద్రం నిధులు కేటాయించాలని, పెట్టుబడి అనుమతివ్వాలని, విభజన చట్టంలోని అంశాలన్నీ నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా కోరింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. గోదావరిలో నీటి లభ్యత తగ్గినందున రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే నీటిని తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. గోదావరి- కృష్ణా నదుల్ని అనుసంధానిస్తే ఎగువ రాష్ట్రాలకు నీరివ్వాలన్న కేడబ్ల్యూడీ అవార్డు ప్రకారం తమకు జలాలు కేటాయించాలని కర్ణాటక కోరింది. అమిత్‌షా స్పందిస్తూ.. నదుల అనుసంధానంపై రాష్ట్రాలు ఓ అంగీకారానికి వస్తే, వాటి అభిప్రాయాల్నీ పరిగణనలోకి తీసుకుని డీపీఆర్ సిద్ధం చేసి ముందుకెళతామని చెప్పినట్టు తెలిసింది.
తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు ఆంధ్రప్రదేశ్ 16-17 టీఎంసీల నీళ్లిస్తున్నామని.. కుప్పం సమీపంలో పాలార్ నదిపై 0.6 టీఎంసీలిచ్చే బ్యారేజీ నిర్మాణానికి తమిళనాడు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కుప్పం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సహకరించాలంది. దీనికి అటవీశాఖ నుంచి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తమిళనాడు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. పాలార్‌పై ఎగువన తమకూ ప్రాజెక్ట్‌లు అవసరం ఉందని, ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది.
తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నీరు సరఫరా చేసినందుకు తమిళనాడు ఇవ్వాల్సిన రూ.340 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ కోరింది. ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు పెద్ద రాష్ట్రమని, వారికి ఆదాయాన్నిచ్చే చెన్నై వంటి మహానగరం కూడా ఉందని జగన్ నవ్వుతూ వ్యాఖ్యానించినట్టు సమాచారం. చెన్నైను వరదలు ముంచెత్తాయని, తమకూ సమస్యలున్నాయని, వీలు చూసుకుని బకాయిలు చెల్లిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధులు చెప్పినట్టు సమాచారం.
తెలంగాణ చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరం తెలియజేసింది. వాటి డీపీఆర్‌లు కేంద్రానికి పంపించాలని అమిత్‌షా సూచించినట్టు తెలిసింది.
విద్యుత్ బకాయిలపై త్వరలో సమావేశం
తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ తేలనందున బకాయిలు చెల్లించలేమని తెలంగాణ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనిపై రెండు రాష్ట్రాలు బలంగా వాదనలు వినిపించాయి. అమిత్‌షా జోక్యం చేసుకుని త్వరలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని చెప్పారు.
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి నిధులిస్తాం
ఏపీలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి నిధులు కేటాయించేందుకు అమిత్‌షా అంగీకరించారు.అయితే దానిలో సగం మంది కేంద్ర బలగాలకు శిక్షణ ఇవ్వాలని స్పష్టంచేశారు.
విభజన చట్టంలోని అంశాల పరిష్కారం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించగా... నెల రోజుల్లో అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. ఉక్కు కర్మాగారం నిర్మాణం గురించి అడగ్గా, మొత్తం సమాచారమిస్తే పరిశీలిస్తామని ఆయన చెప్పినట్టు సమాచారం. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి దేశీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అమిత్‌షా ఆదేశించారు.
గిరిజన విశ్వవిద్యాలయాన్ని కొత్తవలసలో కాకుండా సాలూరు వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దాన్ని నోటిఫై చేయాలన్న ఏపీ వినతిని కేంద్రం అంగీకరించింది.
ఆతిథ్యం ముగిసింది
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి 29వ సమావేశం విజయవంతంగా ముగిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమై.. నాలుగు గంటల పాటు జరిగింది. ముందుగా ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో పెండింగ్ అంశాలను ప్రస్తావించారు. తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రుల ప్రసంగాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. అనంతరం ఎజెండా ఆధారంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం రాత్రి 7.30కు రాష్ట్ర ప్రభుత్వం అతిథులకు విందు ఏర్పాటుచేసింది. అమిత్‌షా సోమవారం మధ్యాహ్నం వరకు తిరుపతిలోనే ఉండనున్నారు. సమావేశంలో లక్షద్వీప్ పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ బి.కె.జోషి, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, కేరళ మంత్రులు కె.ఎన్.బాలగోపాల్, కె.రాజన్, తమిళనాడు మంత్రులు కె.పొన్ముడి, పి.కె.శేఖర్‌బాబు, కర్ణాటక మంత్రులు వి.సుధాకర్, ఆర్.అశోక్ హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత సీఎం జగన్ గంటన్నర సేపు హోటల్‌లోనే ఉండి, సమావేశానికి హాజరైన ప్రతినిధులతో మాట్లాడి, రాత్రి 10 గంటలకు తిరిగి వెళ్లిపోయారు.
తెలంగాణ సీఎస్ అసంతృప్తి : రేణిగుంట విమానాశ్రయం వద్ద పరిస్థితిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ కొంత అసంతృప్తి వ్యక్తంచేశారు. అక్కడ ప్రతి ఒక్కరికీ ఒక లైజనింగ్ అధికారిని నియమించారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్‌కుమార్ ఆదివారం ఉదయం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తమకు లైజనింగ్‌గా ఎవరూ కనిపించకపోవడంతో తమకు కేటాయించిన వాహనం ఎక్కి హోటల్‌కు వచ్చారు. అనంతరం లైజనింగ్ అధికారి హోటల్ వద్దకు వచ్చి తాము విమానాశ్రయంలో ఎదురుచూశామని చెప్పగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పాత వాహనం కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. పాత బండిని తాము సహాయ కార్యదర్శులకూ ఇవ్వబోమని, తాను ప్రైవేటు వాహనం తీసుకుంటానని పేర్కొన్నారు. దీంతో లైజనింగ్ అధికారి ఇలాంటి పొరపాటు జరగదని చెప్పడంతో ఆయన శాంతించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి 30వ సమావేశానికి కేరళ ఆతిథ్యమివ్వనుంది. తదుపరి సమావేశం తిరువనంతపురంలో నిర్వహిద్దామని అమిత్‌షా ప్రతిపాదించగా, అందరూ ఆమోదించినట్టు తెలిసింది.
- ఇదీ చదవండి : 'కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాం'