AATA Celebrations: హైదరాబాద్ రవీంద్రభారతిలో అమెరికా తెలుగు సంఘం ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా నిర్మాణంలో తెలుగువారు కీలకపాత్ర పోషిస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ప్రవాసీయులు మాతృదేశానికి సేవలు చేస్తున్నారని.. అదే ఒరవడిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక..
శాంతి భద్రతలు నిర్వహణ బాగుండటం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ విధానాల వల్ల ఐటీరంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు. కాళేశ్వరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసినందున వ్యవసాయ ఉత్పత్తులు ఐదురెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు.
అభివృద్ధికి ఆటా దోహదపడింది..
ఐటీ సహా కీలక రంగాల్లో తెలంగాణ వాసులు ఉండటం రాష్ట్రానికే గర్వకారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం రాక ముందే ఈ ప్రాంత అభివృద్ధికి ఆటా దోహదపడిందని గుర్తుచేశారు. రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించారు.
ఇదీచూడండి: CJI Justice NV Ramana: జడ్జీల నియామకంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలకవ్యాఖ్యలు!