Amazon Future Engineers Program: సాంకేతిక విద్యలో రాణించడం, అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో సత్ఫలితాలు సాధించవచ్చనే నిపుణుల సూచనలను ఆచరణలో పెట్టారు ఆదివాసీ గిరిజన బాలికలు. పేదరికంలో మగ్గుతూ అరకొర వసతుల మధ్య ప్రభుత్వ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ప్రముఖ కంపెనీ అమెజాన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) నిధులతో అమలు చేస్తున్న కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఏటా రూ. 2.50 కోట్లు ఖర్చు: రాష్ట్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థినులకు కంప్యూటర్ సాంకేతిక విద్యను అందించడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 25 ఆశ్రమ, 25 గురుకులాలు కలిపి మొత్తం 50 పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థినులకు సాంకేతిక శిక్షణ కల్పించడంపై దృష్టిసారించింది. సీఎస్సార్ కింద అమెజాన్ కంపెనీ ఏటా రూ.2.50 కోట్ల నిధులతో ఎడ్యుకేషనల్ ఇన్‌సెంటివ్ కంపెనీ సహకారంతో ఈ ఏడాది జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
నాలుగు సబ్జెక్టుల్లో శిక్షణ:
ఈ కోర్సు ద్వారా విద్యార్థినులు సులభంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్చుకొనేలా ప్రత్యేకించి ‘మైండ్ స్పార్క్’ అనే అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. టీచర్ సహాయం లేకుండానే స్వయంగా దీన్ని ఉపయోగించి నేర్చుకోవచ్చు. ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్స్’ పేరుతో విద్యార్థినులకు కంప్యూటర్ సాంకేతిక కోర్సులో ఆంగ్లం, గణితం, తెలుగు, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ సబ్జెక్టులలో ఇన్‌స్ట్రక్టర్ల పర్యవేక్షణలో శిక్షణనిస్తున్నారు.
ఈ శిక్షణ ‘విద్యార్థినుల్లో సాంకేతిక విజ్ఞాన సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించడానికి ఉపయోగపడుతోంది. గణితంలో విద్యార్థినులకు ఆసక్తిని పెంచుతోంది. భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడానికి ఉపయోగపడే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్‌లో పట్టు సాధించడానికి దోహదం చేస్తుంది’ అని ఎడ్యుకేషనల్ ఇన్‌సెంటివ్ ప్రాజెక్టు మేనేజర్ వికాస్ ఓమర్ తెలిపారు.
ఇవీ చదవండి: