Amaravathi Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు.. నెల్లూరు జిల్లా పుట్టంరాజు వారి కండ్రిగ నుంచి ప్రారంభమైంది. నేడు 15 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయనున్న అన్నదాతలు.. రాత్రికి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకుని అక్కడే బసచేయనున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం
రైతుల పాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వారికి సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులు చేసే పాదయాత్ర తమ స్వార్థం కోసం కాదని ఆయన అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఒక రాజధాని ఉండాలన్నారు. రాజధానిపై స్పష్టత ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోతూ.. పెట్టుబడులు రాని పరిస్థితుల్లో ఏపీ ఉందని అన్నారు. ప్రభుత్వం మళ్లీ తీసుకువస్తానంటున్న మూడు రాజధానుల బిల్లు ఎలా ఉంటుందో వేచి చూడాలన్న లక్ష్మీనారాయణ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ప్రతి ఒక్కరి ధ్యేయమన్నారు. కావాలనుకుంటే ప్రభుత్వం శీతాకాల సమావేశాలు లాంటివి విశాఖ లేదా కర్నూలులో పెట్టుకోవాలని సూచించారు.
కార్తికమాసం చివరిరోజు కావటంతో రాజధాని రైతులు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని.. భగవంతుడిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: TTD CONTRACT EMPLOYEES PROTEST : తితిదే కార్మికుల నిరసన... సమస్యల పరిష్కారానికి డిమాండ్