ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు చేస్తోన్న ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. నిరసన తీవ్రతను ఏపీ సర్కారుకు తెలియజెప్పేందుకు పెదపరిమిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రాకు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏడాది కిందట ముఖ్యమంత్రి జగన్.... మూడు రాజధానుల ప్రకటనతో తమ గుండెల్లో గునపం దించారని వెంకటపాలెం ఎస్సీ ఐకాస నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా...తుళ్లూరు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికలకు ముందు... ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించిన తీరుపై ఓ రైతు చేసిన స్కిట్ అందరినీ ఆలోచింపజేసింది.
గుంటూరు జిల్లా రాయపూడిలో జనరణభేరి పేరిట నిర్వహిస్తున్న భారీబహిరంగ సభకు ప్రజలంతా తరలిరావాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం భూములిచ్చిన తమను.... ఏడాది నుంచి సర్కారు వేధిస్తోందని మండిపడ్డారు. గురువారం జరిగే సభలో పోరాట ప్రణాళికను వెల్లడిస్తామని నేతలు తెలిపారు.
అమరావతి ఐకాస బహిరంగ సభకు ఏపీలోని రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జనరణభేరి ప్రాంతాన్ని పరిశీలించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ సీఎం సొంత నియోజకవర్గ ప్రజలే స్వాగతించడం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
తెలుగునాడు కార్మిక సంఘం ఆధ్వర్యంలో... విజయవాడలోని ధర్నాచౌక్లో అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలు చేశారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలంతా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.
ఇవీచూడండి: రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు ఫలప్రదంగా జరగాలి: వెంకయ్య