వినాయక చవితి(VINAYAKA CHAVITHI) నవరాత్రులకు హైదరాబాద్ ముస్తాబైంది. మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు విగ్రహాలను సిద్ధం చేసుకున్నారు. మరికొందరు వాహనాల్లో విగ్రహాలను తరలిస్తున్నారు. ధూల్‌పేట వినాయక విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రం. మండపాల నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పండుగ వేళ పూజ సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. జిల్లాల్లోనూ గణపయ్య ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. పలు కూడళ్లు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. విగ్రహాల కోసం వస్తున్న వారితో పాటు, పూజ సామగ్రి కోసం రోడ్లపైకి రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన కూడళ్లు, మార్కెట్ల వద్ద జనసందడి పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది.
వినాయక చవితి పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐక్యత, శాంతి, అభివృద్ధిలో ఉన్న అవరోధాలను లంబోదరుడు తొలగించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖఃశాంతులు అందించడంతోపాటు... ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని గణనాథుణ్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రార్థించారు. వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి గణేశుని నవరాత్రి ఉత్సవాలు పర్యావరణహితంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో విశ్వగురు దిశగా ముందుకెళ్తున్న దేశానికి వినాయకుడి దీవెనలు లభిస్తాయని ఆకాంక్షించారు.
11గంటలకు ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ
ఇవాళ కొలువు దీరనున్న ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11గంటలకు వైభవంగా జరగనున్న పూజా కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. కొవిడ్ దృష్ట్యా భక్తులు మాస్కులు ధరించి రావాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. లక్షలాది మంది తరలివచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు.
మట్టి విగ్రహాలను పంపిణీ..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఇప్పటి వరకు 70 వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తొలి గణపతి విగ్రహాన్ని స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ అందజేసి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జంటనగరాలలోని పలు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్ఎండీఏ ఉద్యోగులు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. తెలంగాణ హైకోర్టులో ఉద్యోగులకు హెచ్ఎండీఏ అధికారులు మట్టి గణపతులు అందజేశారు. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ ప్రసూనాంబ, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి తదితరులు ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.
ఇవీ చూడండి: VINAYAKA CHAVITHI: తగ్గిన విగ్రహాల తయారీ.. చివర్లో వస్తే కష్టమే..