వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరు కొనసాగుతోంది. రేపటి భారత్ బంద్‌కు వివిధ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. రైతులు తలపెట్టిన భారత్ బంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్... కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
మద్దతుగా ర్యాలీలు
రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు నిర్వహించే... భారత్ బంద్‌లో భాగస్వాములు కావాలని... మంత్రి తలసాని పేర్కొన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద... సనత్ నగర్ నియోజకవర్గ తెరాస నేతలతో సమావేశం నిర్వహించారు. 2 వేల వాహనాలతో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. రైతులకు మద్దతుగా రేపు జరగబోయే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ... తన నియోజకవర్గ పరిధిలో దానం నాగేందర్ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఎడ్ల బండ్ల ర్యాలీ
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని.. కరీంనగర్ జిల్లా గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. అన్నదాతలకు మద్దతుగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రజలంతా బంద్ పాటించాలని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. రైతులకు మద్దతుగా వరంగల్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో... ఎడ్ల బండ్లతో ర్యాలీ చేపట్టారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఖాజీపేట రైల్వే స్టేషన్ నుంచి హన్మకొండలోని ఎకశిలా పార్కు వరకు ర్యాలీ చేశారు.
టీఎన్జీవో మద్దతు
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ప్రకటించిన రేపటి భారత బంద్‌కు తెలంగాణ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. బంద్‌లో పాల్గొంటున్నామని తెలంగాణ నాన్ - గెజిటెడ్ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు.
ఇదీ చదవండి: త్వరలోనే ఖమ్మం ఐటీ హబ్‌లో నైపుణ్యాభివృద్ధి కేంద్రం : కేటీఆర్