కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు (educational institutions in telangana) తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ సహా అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అన్నింటా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కరోనా వల్ల విద్యారంగంలో అయోమయం నెలకొందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యార్థులు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎక్కువకాలం పాఠశాలలు మూసివేస్తే పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని వైద్యశాఖ అధికారులు చెప్పారన్నారు. అన్ని అంశాలపై సమీక్షించి విద్యాసంస్థలు పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
'కరోనా వల్ల విద్యారంగంలో అయోమయం నెలకొంది. విద్యార్థులు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బందిపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందని నివేదికలు వచ్చాయి. ఎక్కువకాలం పాఠశాలలు మూసివేస్తే పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని వైద్యశాఖ అధికారులు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో పరిశుభ్రత బాధ్యత అధికారులు చూస్తారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు పరిశుభ్రత బాధ్యతలు అప్పగిస్తాం. ఈనెల 30 లోపు విద్యాసంస్థలను శానిటైజ్ చేయాలి.'
- సీఎం కేసీఆర్
కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఈనెలలోనే విద్యాసంస్థలు తెరుస్తున్నాయి.