ALAI BALAI PROGRAM AT HYDERABAD: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. డోలు వాయించి దత్తాత్రేయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, కేంద్రమంత్రి భగవంత్ కూబా, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, తెరాస సెక్రెటరీ జనరల్ కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కళాకారులతో కలిసి వీహెచ్, చిరంజీవి డప్పు వాయించి నృత్యం చేశారు.
శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడానికే ఈ కార్యక్రమం: తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనేదే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని కమిటీ ఛైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. అంతా సమానమన్న స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని.. ఐకమత్యంగా ఉండాలని పేర్కొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. అందరూ కలిసుంటేనే జఠిలమైన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
ఒకే వేదికపై అన్ని రాజకీయ పార్టీలు: అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకను దేశవ్యాప్తం చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావటం సంతోషమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది: దత్తాత్రేయకు రాష్ట్ర ప్రజల తరఫున కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలయ్ బలయ్‌కు హాజరైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దత్తాత్రేయను సన్మానించారు. తెలంగాణ ఉద్యమానికి ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చిందని వ్యాఖ్యానించారు. అలయ్ బలయ్ వేడుక సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని పలువురు వ్యాఖ్యానించారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి బాధ్యత తీసుకోవటం అభినందనీయమని ప్రశంసించారు.
ఇవీ చదవండి: