మైనార్టీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలకు విస్తరించి.. దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోంది మజ్లిస్ పార్టీ. తాజాగా బిహార్ ఎన్నికల్లో 5 అసెంబ్లీ సీట్లు గెలుచున్న ఎంఐఎం రాబోయే బంగాల్ ఎన్నికలవైపు దృష్టి సారిస్తోంది. 1959లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికలో రెండు స్థానాలతో మొదలైన మజ్లిస్ పార్టీ ప్రస్థానం ప్రస్తుతం 44 స్థానాలకు ఎగబాకింది.
సాంస్కృతిక మత సంస్థగా
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సూచన మేరకు గోల్కొండ ఖిలేదార్ నవాబ్ మహమూద్ నవాజ్‌ఖాన్, బహదూర్ యార్‌జంగ్‌తో కలిసి 1927లో నవంబర్ 12న మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను స్థాపించారు. ఇస్లాం సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి 1938లో బహదూర్ యార్ జంగ్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. 1944లో బహదూర్ యార్ జంగ్ మరణానంతరం ఎంఐఎం అధినేతగా ఖాసీం రజ్వీ ఎన్నికయ్యారు.
1957 తర్వాత ఖాసీం రజ్వీ పార్టీని అబ్దుల్ వాహెద్ ఒవైసీకి అప్పగించారు. 1975లో అబ్దుల్ వాహెద్ ఒవైసీ అనంతరం తనయుడు సలావుద్దీన్ ఒవైసీ పగ్గాలు చేపట్టారు. పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చినా.. ప్రజలు ఓడించినా పార్టీని ముందుకు నడిపించారు. 1960లో తొలిసారిగా మల్లెపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగాను, ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1993 మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న అమానుల్లాఖాన్.. పార్టీ అధినేత సలావుద్దీన్ ఒవైసీతో విబేధించారు. అప్పుడే మజ్లిస్ బచావో- తహరీక్(ఎంబీటీ)పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. 1994 శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్ తరఫున అసదుద్దీన్ ఒవైసీ చార్మినార్ నుంచి ఒక్కరే విజయం సాధించారు. ఎంబీటీ తరఫున చాంద్రాయణగుట్ట నుంచి అమానుల్లాఖాన్, యాకుత్‌పురా నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్ గెలుపొందారు.
మళ్లీ పుంజుకుని
పార్టీకి పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు సలావుద్దీన్ ఒవైసీ విశేష కృషి చేశారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్‌ను మళ్లీ ఓటర్లు అక్కున చేర్చుకున్నారు. మరోవైపు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అహ్మద్ షరీఫ్, బాకర్ ఆఘా, ఇబ్రహీం మస్కతి పార్టీ నుంచి బయటకు వచ్చారు. వేలమంది ముస్లిం కార్యకర్తలున్నా.. తాము ఇతర మతాలకు వ్యతిరేకం కాదని నిరూపించుకునేందుకు మజ్లిస్ పార్టీ.. దళితులైన ఆలంపల్లి పోచయ్య, ఎ.సత్యనారాయణ, కె.ప్రకాశ్‌రావులకు హైదరాబాద్ నగర మేయర్‌గా అవకాశాలు కల్పించింది. అప్పటి నుంచి నగర పాలక, అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు, దళితులకు టికెట్లు ఇస్తూ మతతత్వ ముద్రను చెరిపి వేసుకునే ప్రయత్నం చేస్తోంది.
బిహార్‌లో 5..
ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఉద్దేశంతో 2014లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత నుంచి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతూ వస్తోంది. ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఐదుగురి గెలుపుతో మజ్లిస్‌కు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. పశ్చిమ బంగలోను పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నట్లు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
52 స్థానాల నుంచి బల్దియా బరిలో..
2009లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు తొలిసారిగా జరిగాయి. కాంగ్రెస్ సహకారంతో రెండున్నర ఏళ్ల పాటు మేయర్ పీఠాన్ని దక్కించుకొంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 44 స్థానాలను దక్కించుకున్నా మేయర్ పీఠానికి దూరంగా ఉంది. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో అంతర్గతంగా పొత్తు ఉన్నా బహిరంగంగా ఎలాంటి పోటీ లేదని ఎంఐఎం స్పష్టం చేసింది. స్నేహపూర్వక పోటీ చేస్తున్న ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో మాత్రం కేంద్రంలోని భాజపాతో పాటు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల నుంచి పోటీ చేసిన ఎంఐఎం ఈసారి మాత్రం 52 స్థానాలకే పరిమితమవుతోంది.
అవే ప్రచారాస్త్రాలు
ఏ ఎన్నికలు వచ్చినా నిరుద్యోగులపై నిర్లక్ష్యం, రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా మతరాజకీయాలు చేస్తున్నారంటూ ప్రజల మధ్యకు వెళుతూ విస్తరించేందుకు యత్నిస్తోంది మజ్లిస్ పార్టీ.