AIG Chairman Omicron: రాష్ట్రంలో ‘బిఎ 2’ ఉపరకం ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ వేరియంట్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంతో తగ్గుముఖం పట్టాయన్నారు. మన దేశంలో ప్రస్తుతం దీని ఉద్ధృతి కొనసాగుతోందని, వచ్చే 4 వారాల్లో తగ్గుముఖం పట్టి, స్వల్పంగా నమోదు కావచ్చని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, గుర్తింపు, టీకాలపై ఏఐజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రసంగించారు.
మరణాలు చాలా తక్కువ
‘‘తొలి రెండు కొవిడ్ దశల్లో బీటా, డెల్టా వేరియంట్ల కారణంగా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. మూడోదశలో ఒమిక్రాన్ వల్ల మరణాలు చాలా తక్కువ. ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో ఎస్ జీన్ కనిపించకుండా ఉంటే.. దాన్ని ఒమిక్రాన్‌గా భావించేవాళ్లం. ఒమిక్రాన్ బిఎ2 దీన్ని అధిగమించింది. ఎస్ జీన్‌ను గుర్తించిన వారిలోనూ ఒమిక్రాన్ బిఎ2 ఉపరకం వ్యాప్తి చెందుతోందని గుర్తించాం. ఒమిక్రానా? డెల్టానా? అనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను డెల్టా వేరియంట్ సోకిన రోగుల్లో వినియోగిస్తే ఉపయోగంగా ఉంటుంది. అదే ఒమిక్రాన్‌లో వినియోగించకూడదు.’’ - నాగేశ్వరరెడ్డి
లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి
ఒమిక్రాన్ బిఎ2లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని నాగేశ్వరరెడ్డి తెలిపారు. కానీ కొద్దిమందిలో తీవ్రమవుతోందన్నారు. తమ ఆసుపత్రిలోనే 20 మంది వేర్వేరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఒమిక్రాన్ బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పిల్లలు కూడా గుర్తింపు స్థాయిలో ఈ వేరియంట్‌కు ప్రభావితమవుతున్నారని చెప్పారు. డెల్టాలో మాదిరిగా ఒమిక్రాన్‌లోనూ దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కొందరిలో నీరసం, నిస్సత్తువ వంటివి ఇబ్బంది పెడుతున్నాయని వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్ బారినపడడం.. వ్యాక్సిన్ తీసుకోవడం.. ఈ రెండు మిళితమైన వారిలో అధికంగా యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని... వీరిలో టి కణాల నుంచి రక్షణ లభిస్తుందని వివరించారు.
ఇదీ చదవండి : తీవ్రంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్