సంచార రైతుబజార్ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్ల నిర్వహణ, పనితీరు, కూరగాయలు, పండ్ల సరాఫరాపై మంత్రి ఆరాతీశారు. జీపీఎస్ ద్వారా ఈసీఐఎల్‌లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మంత్రి స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కరోనా వైరస్, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇండ్ల వద్దకే పండ్లు, కూరగాయలు సరఫరా చేస్తున్న దృష్ట్యా... రైతుబజార్ నిర్వాహకుడితో మంత్రి సంభాషించారు. క్షేత్రస్థాయిలో రైతు నుంచి కూరగాయల సేకరణతో పాటు పంపిణీ విధానం అద్భుతంగా ఉందని మంత్రి కితాబు ఇచ్చారు. అవసరం ఉన్న ప్రాంతాలను తెలుసుకొని నాలుగు రోజులకోసారి వాహనాలు పంపిస్తున్నట్లు తెలిపారు.
మొబైల్ రైతుబజార్లతో కూరగాయలు, పండ్ల ధరలు అదుపులో ఉన్నాయన్న మంత్రి.. ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉందని ఆరా తీశారు. మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతుబజార్ ఎస్టేట్ల మేనేజర్లకు అభినందించారు. కీలక సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారని మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీచూడండి: వెయ్యి కి.మీ రోడ్డు పనులకు నిధుల విడుదల : ఎర్రబెల్లి