adulterated hyderabad biryani : తెల్లనివన్నీ పాలు కావు.. కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. అందులో నాసిరకం ఉండొచ్చు, ప్రమాదకరమైన పదార్థాలూ కలవొచ్చు. జీహెచ్‌ఎంపీ ఆహార కల్తీ నియంత్రణ అధికారులు ఇటీవల కాలంలో పరీక్షించిన నమూనాల ఫలితాలను పరిశీలించగా.. చాలా పదార్థాల్లో నిషేధిత టర్‌ట్రాజైన్ అనే రంగు కలిసి ఉంది. సింథటిక్‌తో తయారయ్యే ఈ రసాయనం నీటిలో బాగా కలిసిపోతుంది. ఏదైనా వస్తువును అందులో ముంచితే నిగనిగలాడే రూపాన్నిస్తుంది. ఆహార భద్రత ప్రమాణాలు-2011 మార్గదర్శకాల ప్రకారం.. దీనిని వంటకాల్లో వాడటంపై నిషేధం ఉంది. మిఠాయిల్లో పరిమితి మేర ఉపయోగించాలి. పరిమితి మించితే ఆస్తమా, దద్దుర్లు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందన్నది వైద్యుల మాట.
వెనిగర్, టమాట సాస్..
adulterated food in hyderabad : ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో ఉపయోగించే వెనిగర్‌లో మోతాకు మించి ఆమ్లం ఉంటోంది. టమాటా సాస్ కూడా కల్తీనే. డబ్బాల్లో దొరికే అల్లం వెల్లుల్లి మిశ్రమం మరింత దుర్భరంగా ఉంటోంది. వ్యాపారులు కుళ్లిన వెల్లుల్లి, నాసిరకం అల్లం, బెన్‌జెయిక్ యాసిడ్, ఇతర రంగులు కలిపి మిశ్రమం తయారుచేస్తున్నారు. అలా తయారైన మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. సగ్గు బియాన్ని పరీక్షిస్తే అందులో దుంపలతో తయారైన పొడి, నీలిమందు ఉన్నాయి. బెల్లంలో సల్ఫర్ డయాక్సైడ్ ఉంటోంది. ఇవన్నీ ఒంటికి చేటుకు కలిగించేవే.
బిర్యానీ, కోడికూరలో..
Adulteration of hyderabad Biryani : పేరొందిన రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో కోడి మాంసం వంటలు ఎర్రగా కంటికింపుగా కనిపిస్తాయి. ముఖ్యంగా తందూరి చికెన్, చికెన్ 65, ఇతరత్రా వంటకాలను చేత్తో తిన్నప్పుడు రంగులు ఏమేర ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. అదంతా టర్‌ట్రాజైన్‌తో తయారైన కృత్రిమ రంగు. పొట్టలోని పేగులకూ ఈ రంగు అంటుకుంటుంది. ఇతర రుగ్మతలనూ కలిగిస్తుంది.
పాలు, పెరుగులో..
వేసవికి ముందు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో బల్దియా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పాలు, పెరుగు పరీక్షించారు. రుచి కోసం చక్కెర కలిపినట్లు తేలింది. అందులో ప్రముఖ బ్రాండెడ్ పాలు కూడా ఉన్నాయి. వేసవిలో పాల లభ్యత తగ్గుతుంది. రాబోయే ఐదు నెలల్లో పాల కల్తీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
మోతీచూర్ లడ్డూ
ఖైరతాబాద్‌లో ఓ మిఠాయి దుకాణంలో ‘కాజు అంజీర్ కటిల్’ అనే పదార్థాన్ని ప్రయోగశాలకు పంపారు. పసుపు రంగు 15.17పీపీఎం, కార్మొయిసైన్ 134.77, టర్‌ట్రాజైన్ 19.28 పీపీఎం మోతాదులో కలిపారు. మొత్తంగా పదార్థంలో 169.22పీపీఎం మేర కృత్రిమ రంగు ఉంది. నిబంధనల ప్రకారం 100పీపీఎం మించకూడదు. మరో దుకాణంలో మోతీ చూర్ లడ్డును పరీక్షించగా.. పసుపు రంగు 153.30, టర్‌ట్రాజైన్ 45.49 పీపీఎం మోతాదులో కలిపారు. మొత్తంగా 169.22పీపీఎం మేర రంగు ఉంది.
- ఇదీ చదవండి : ఆఫర్లు చూసి టెంప్ట్.. పార్శిల్ ఓపెన్ చేస్తే కంపు