ఆధార్ కార్డుల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ప్రతి కార్యక్రమానికి తప్పనిసరని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానంతో ఆ సంస్థలు పారదర్శకత పెంచుతున్నాయి. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, ఉపాధి హామీపథకం, ఉపకార వేతనాలు, పించన్లకు వంటి వాటికి విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరిచేయడంతో అంతా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఆధార్ కార్డులు తీసుకునే వారితోపాటు... మార్పులు, చేర్పులు చేసుకునే వారి సంఖ్య భారీగా ఉంటోంది.
రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో గతేడాది మే వరకు 3.93 కోట్ల జనాభా ఉంటుందని నీతిఆయోగ్ అంచనా వేయగా 3.99 కోట్లకుపైగా కార్డులు జారీ అయ్యాయి. 100కి 102 శాతం ఎన్‌రోల్‌మెంట్ అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ సహా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బయట రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అధికంగా ఉండడంతో... అక్కడ 30 నుంచి 40 శాతం ఎక్కువ ఆధార్ కార్డులున్నట్లు ఉడాయ్ అధికారులు తెలిపారు. ఈనెల13 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 99లక్షలా 81వేల 741 ఆధార్ కార్డులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండున్నర వేలకుపైగా... ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలున్నాయి. అందులో పాఠశాల స్థాయిలో విద్యార్ధుల కోసం... మండలానికి రెండు, మూడు లెక్కన దాదాపు 1300 ఆధార్ కిట్లు ఉండగా..కరోనా వల్ల పాఠశాలలు పనిచేయకపోవడంతో అవి అందుబాటులో లేవు. రాష్ట్రవ్యాప్తంగా 578 మీసేవా కేంద్రాలు, బ్యాంకుల ద్వారా 440, తపాల శాఖ ద్వారా 180, బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో 12 ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలున్నట్లు అధికారులు తెలిపారు. అవికాకుండా... హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్‌లో స్వయంగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలను నిర్వహిస్తోంది. కొవిడ్‌తో మార్చి చివరి వారంలో ఆ కేంద్రాలు మూతపడ్డాయి. మే నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలు తెరిచేందుకు అనుమతించినా ప్రజల నుంచి స్పందనలేదు. అక్టోబరు నుంచి పాఠశాలలకు చెందినవి మినహా... మిగిలినవి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రతినెల 40వేలకు తగ్గకుండా ఎన్‌రోల్‌మెంట్ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: డీజిల్ పొదుపులో టీఎస్ఆర్టీసీ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం