ఇంద్రియాల వల్ల వచ్చిన సుఖం, సంతోషం క్షణికాలు. ఎలా వచ్చాయో, అలాగేపోతాయి. కానీ సుఖదుఃఖాలకు అతీతమైన స్థితిలో ఏ అలజడీ ఉండదు. ఏ ఆలోచనలూ రావు. దాన్నే సచ్చిదానందం అంటారు. ఆ స్థితికి ప్రతిరూపం శివ స్వరూపం. అలా ఉండడం సామాన్యులకు సాధ్యమేనా? సుఖదుఃఖాలకు అతీతమైన స్థితికి ఎలా చేరుకోవాలి? మహేశ్వర స్వరూపమే దీన్నీ వివరిస్తుంది.
యోగ ముద్రలో, నిరంతర ధ్యానంలో ఉన్న ఆయన మెడలో కాలసర్పం బుసలు కొడుతున్నా, తలపై గంగమ్మ చిందులు తొక్కుతున్నా అదరక, బెదరక లక్ష్యంపైనే దృష్టి నిలిపి ధ్యానం చేస్తుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిర చిత్తంతో ఉండమని చాటుతాడాయన. అదే జ్ఞానానందం. అదే శివసందేశం.. ఆయన లోకజ్ఞానాన్నే కాదు, ఆత్మజ్ఞానాన్ని కూడా మానవజాతికి అందిస్తాడు. శివుడంటే ఎక్కడో హిమవన్నగాల్లో ఉండేవాడు కాదు. మనం లేచింది మొదలు, నిద్ర పోయేదాకా ప్రతిదీ ఈశ్వర సంబంధమే.
- ఇదీ చూడండి : పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?