ELECTRIC AUTO: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలతో ఆటోమొబైల్ రంగం పూర్తిగా కుదేలైపోతోంది. పెరుగుతున్న డీజిల్ ధరలకు తోడు.. మైలేజ్ రాక ఆటోడ్రైవర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఆటోడ్రైవర్ అఖిల్.. ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆటో అధిక ధర ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. తనకు ఉన్న ఆటోనే ఎలక్ట్రిక్ వాహనంగా ఎందుకు మార్చుకోకూడదంటూ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా ఎలక్ట్రిక్ ఆటో పనితీరు గురించి తెలుసుకోవడమే గాక.. సొంతంగా ఆటోనే తయారు చేశాడు.
దిల్లీ వెళ్లి రూ.80 వేలతో 4 బ్యాటరీలు, డీసీ మోటర్, కంట్రోలర్, ఛార్జర్లను కొనుగోలు చేసి తీసుకొచ్చిన అఖిల్.. తన పాత ఆటో ఇంజిన్ తొలగించి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేశాడు. ఇంకేముంది డీజిల్ అవసరం లేకుండానే ఆటో రయ్‌రయ్‌మంటూ పరుగులెడుతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఆటో వినియోగిస్తున్నా.. ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని.. వేగంలోనూ, బరువు మోయడంలోనూ సాధారణ ఆటోకి ఏమాత్రం తీసిపోకుండా పని చేస్తోందని అఖిల్ తెలిపాడు. ఎలక్ట్రిక్ ఆటోతో డబ్బులు ఆదా కావడమే కాకుండా.. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని అఖిల్ తెలిపాడు. నిర్వహణ వ్యయం ఏమాత్రం లేదని ఆనందం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి అఖిల్ రూపొందించిన ఆటో ఎంపికైంది.
ఇవీ చదవండి:
మంజీరా పైప్‌లైన్ పగిలింది.. దుకాణాల్లోకి నీరు చేరింది
మార్కులు వేయలేదని టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన స్టూడెంట్స్