అమెరికా సైనికులు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా విడిచి వెళ్లారు. అగ్రరాజ్యం సైన్యం తిరుగు పయనం గడువు ఇలా ముగిసిందోలేదో.. అలా తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారిని వరుసబెట్టి మట్టుబెడుతున్నారు. ఊచకోతలు, ఉరితీతలతో అమాయకుల రక్తం తాగుతూ తమ ఎజెండా అమలు చేస్తున్నారు. అమెరికా బలగాల చివరి విమానం వెళ్లగానే తాలిబన్లు కాబుల్ విమానాశ్రయాన్ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు.
మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ఈరోజు తమకు సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సిద్ధించిందని అభివర్ణించారు.
మరోవైపు తాలిబన్ల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అఫ్గాన్‌లోని హజారా మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన 14 మందిని తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపారు. వారిలో 12 మంది సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులున్నారు. తమ ఆధిపత్యాన్ని హజారా మైనారిటీ వర్గ ప్రజలు అంగీకరించకపోవడం వల్లే తాలిబన్లు ఈ నరమేధానికి పాల్పడినట్లు తెలుస్తోంది. డేకుండి ప్రావిన్స్‌లోని ఖదిర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
తుపాకుల మోతలే కాదు.. తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్న పలువురిని హెలీకాప్టర్లకు వేలాడదీస్తూ ఉరి వేస్తున్నారు. అమెరికా బ్లాక్ హక్ హెలికాఫ్టర్‌పై తాలిబన్లు ఓ వ్యక్తిని ఉరితీసిన విడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పంజ్‌షీర్‌పైనా తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు. అయితే దాడికి తెగబడిన తాలిబన్లకు మళ్లీ పరాభవం ఎదురైంది. తాలిబన్ వ్యతిరేక దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ పోరులో తాము ఏడు నుంచి ఎనిమిదిమంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు అహ్మద్ మసౌద్ అధికార ప్రతినిధి ఫాహిత్ దష్తీ తెలిపారు.
ఇదీ చూడండి: Afghan Taliban: అఫ్గాన్ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!