Bride Death Case: ఏపీ విశాఖ మధురవాడలో పెళ్లిపీటలపై కుప్పకూలి వధువు చనిపోయిన ఘటన కీలక మలుపు తిరిగింది. తొలుత సాధారణ మరణంగానే భావించినా.. ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలియనున్నాయి. మధురవాడలో బుధవారం రాత్రి వివాహం జరుగుతుండగా పెళ్లిపీటలపై ఒక్కసారిగా వధువు కుప్పకూలి చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లి కుమార్తె ఎందుకు చనిపోయిందో ఎవరికీ అంతుచిక్కలేదు.
సాధారణ మరణమే అయి ఉండవచ్చని మొదట అంతా భావించారు. కానీ ఆసుపత్రికి తరలించి వైద్యులు పరిశీలించాక.. విషయం మరో మలుపు తీసుకుంది. విషపూరిత పదార్థం సేవించడం వల్లే పెళ్లి కుమార్తె సృజన చనిపోయిందని వైద్యులు చెప్పినట్లు మధురవాడ సీఐ రవికుమార్ చెప్పారు. మృతిరాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు అసలు కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సృజన వివాహానికి మధురవాడ నగరంపాలెంలో భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి అట్టహాసంగా వివాహ వేడుక నిర్వహిస్తున్నారు. పండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య జీలకర్ర బెల్లం కార్యక్రమం నిర్వహిస్తుండగా... ఒక్కసారిగా వధువు సృజన ఉన్నట్టుండి పెళ్లి పీటలపైనే కుప్పకూలింది. ఈ అనూహ్య పరిణామంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి మండపంలోని వారంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న కుటుంబసభ్యులు ఆమెకు సపర్యలు చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. రాత్రి నుంచి చికిత్స అందించగా... ఈ ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. రెండు రోజులుగా పెళ్లికుమార్తె అలసటకు గురై నీరసించిందని... కానీ ప్రాణం కోల్పోతుందని భావించిలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వధువు ఆస్పత్రిలో చేరిన తర్వాత ఇవాళ ఉదయం చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. పాయిజన్ తీసుకోవడమే అమ్మాయి మరణానికి కారణమని వారు వివరించారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. మరిన్ని వివరాలు తొందర్లోనే వెల్లడిస్తాం. -- రవికుమార్, మధురవాడ సీఐ
ఇవీ చదవండి :
పెళ్లిపీటలపై విషాదం.. జీలకర్ర బెల్లం పెడుతుండగా కుప్పకూలిన వధువు
'నేను లేకుండా ఎలా బతుకుతారు కన్నా... అందుకే నాతో తీసుకెళ్తున్నా'
యూట్యూబ్లో ఆ వీడియో చూశాడు.. వ్యాపారి నుంచి రూ. 45 లక్షలు కొల్లగొట్టాడు