సైడ్‌స్టాండ్ తీయడం మరచి ద్విచక్ర వాహనం నడపడం ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నమురపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తనూష్ బాబు అనే పదో తరగతి విద్యార్థి బలయ్యాడు.
కుమారుడు చదువు కోసం తల్లిదండ్రులు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉంటున్నారు. తనుష్ బాబు ఇటీవలే సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రాసి తమ స్వగ్రామానికి మూడు రోజులు కిందట తమ చిన్నాన్న ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే సరదాగా ద్విచక్ర వాహనం నడిపిన అతడు... వాహనం సైడ్ స్టాండ్ తీయడం మరిచాడు. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా స్టాండ్ రోడ్డుకు తగిలి విద్యార్థి రహదారిపై బలంగా పడ్డాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు.
కుమారుడి చదువుకోసమే ఉన్నఊరిని, బంధువులను వదిలి మరోచోట నివసిస్తున్న తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని విషాదం మిగిల్చింది.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!